ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని వారిని నిర్వాహకుల వేధిస్తుండటంతో మనస్తాపంతో బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఓ యువ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన సునీల్(29) కొంతకాలంగా రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సంవత్సర కాలంగా ఆయన ఆన్‌లైన్‌లోని పలు యాప్‌ల ద్వారా అప్పులు తీసుకుని ఒకటీరెండు రోజుల వ్యవధిలోనే తిరిగి చెల్లించేవారు. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా యాప్‌ల నుంచి అప్పులు తీసుకున్నా తిరిగి చెల్లించలేకపోయారు.
ఈ క్రమంలో ఆయా యాప్‌ల నిర్వాహకులు వడ్డీపై వడ్డీ వేస్తూ అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఇంతే కాకుండా రుణాల వివరాలను ఆయనకు సంబంధించిన ఫోన్ కాంటాక్టులన్నింటికీ వాట్సప్ ద్వారా సందేశాలను పంపుతూ వేధించారు. దీనిని అవమానంగా భావించిన సునీల్ బుధవారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.