తమను హతమార్చేందుకు పోలీసులు కుట్ర పన్ని నోటీసులు పంపారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనలపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమకు గురజాల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. మాచర్ల ఘటనకి సంబంధించిన ఆధారాలతో వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందుకు తన కార్యాలయానికి రావాలని గురజాల డీఎస్పీ నోటీసులో వివరించారు. ఈ విషయమై బుద్దా వెంకన్న స్పందించారు.
పోలీసులు ముందు పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. లేకుంటే తమపై జరిగిన హత్యాయత్నం కేసు సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరతామని వెల్లడించారు. ఫోన్లు టాప్ చేసి తమపై తప్పుడు కేసులు పెట్టాలని పోలీసులు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమపై ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో హత్యాయత్నం జరిగిందని బుద్దా చెప్పారు.