Gurukul Schools Condition: 'నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ' అంటూనే పేద పిల్లలు చదివే గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టిస్తున్నామంటూనే నెలల తరబడి డైట్ ఛార్జీల బిల్లులను చెల్లించకుండా పెండింగ్ పెట్టారు.
ఎలాగోలా ప్రిన్సిపల్స్ తిప్పలు పడి వండిస్తుండటంతో ఇక వంట ఎలా చేస్తారో చూస్తాననేలా గ్యాస్ బిల్లులూ బకాయి పెట్టారు. ఒకటి, రెండు నెలలు కాదు ఏకంగా 3 నుంచి 5 నెలలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. బీసీ గురుకులాల్లో మాత్రం ఇప్పటికి గ్యాస్ సమస్య లేదు. మొత్తంగా అన్నింటికీ కలిపి 30 కోట్ల రూపాయల మేర చెల్లింపులు ప్రభుత్వం నిలిపివేసింది.
ఎస్సీ గురుకులాలకు సంబంధించి ఒక్కో చోట 640 మంది పిల్లలుంటారు. వారికి వంట చేసేందుకు రోజుకు రెండు సిలిండర్లు అవసరం. అంటే 2 వేల రూపాయల ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం 5 నెలలుగా గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని చోట్ల ఏజెన్సీలు సరఫరా నిలిపేశాయి. దీంతో ప్రిన్సిపల్స్ చేతి నుంచి ఆ డబ్బు పెట్టుకుని సిలిండర్‌లు తెప్పిస్తున్నారు. సగటును నెలకు 50 సిలిండర్లు వేసుకున్నా 50 వేలు ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు ఎలా పెట్టుకుంటారనే విషయాన్నీ ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదు.
YSRCP Govt Neglecting SC People: రాష్ట్రంలో ఎస్సీ ప్రజలను.. వారి విద్యను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం..
గతంలో 15, 20 రోజుల వ్యవధిలో నెలవారీ బిల్లులు వచ్చేవి. జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఏ బిల్లూ సక్రమంగా చెల్లించడం లేదు. తరుచుగా 3, 4 నెలులు పెండింగ్ పెడుతూనే ఉన్నారు. అనుయాయుల అస్మదీయులైన గుత్తేదారుల బిల్లులను ఠంచనుగా చెల్లించేందుకు చేతులాడే జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద పిల్లల బువ్వకు అయ్యే ఖర్చు ఇచ్చేందుకు మాత్రం చేతులు రావడం లేదు. ప్రిన్సిపల్స్ నుంచి ఒత్తిడి పెరిగినప్పుడే అప్పుడప్పుడు బిల్లులు ఇస్తున్నారు. అది కూడా పెండింగ్ మొత్తం కాకుండా ఎన్నో కొన్ని నెలలు మాత్రమే.
గ్యాస్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కొన్ని చోట్ల సరఫరాను గుత్తేదారు సంస్థలు నిలిపేశాయి. దీంతో చేతి నుంచి డబ్బులు పెట్టుకోలేక కట్టెల పొయ్యి పెట్టుకుని వంట చేసి పిల్లలకు పెడుతున్నారు. అలా వండిన అన్నం పొగచూరి వాసన వస్తోంది. ముద్దగా కూడా తయారవుతోంది. పిల్లలు తినలేక అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితులూ కొన్ని చోట్ల ఉంటున్నాయి.
Sagileru Ambedkar Gurukula School Buildings Damaged: శిథిలావస్థకు గురుకుల భవనం.. ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థుల టెన్షన్
పిల్లలకు జగన్ మామయ్య పెడుతున్న నాణ్యమైన భోజనం తీరిది. మరికొన్ని చోట్ల ప్రిన్సిపల్స్ ఏజెన్సీ ప్రతినిధులను బతిమాలి సరఫరా చేయించుకుంటున్నారు. కొందరైతే ఇక సరఫరా చేయలేం, వేరే ఏజెన్సీని చూసుకోండని తెగేసి చెబుతున్నారు. చాలా చోట్ల ప్రతి నెలా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. కడప, అన్నమయ్య జిల్లాల్లో రాజకీయ నాయకులతో గుత్తేదారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగోలా సరఫరా చేయించుకుంటున్నారు. ఇది కూడా ఎన్నో రోజులు సాగని పరిస్థితి నెలకొంది.
ఎస్సీ గురుకులాలకు సంబంధించి నిర్వహణ ఖర్చులు నెలకు 10 వేల రూపాయలివ్వాలి. పిల్లలకు ఆసుపత్రి ఖర్చులో మరమ్మతులు, జిరాక్స్ ఖర్చులు, ఇతర వాటి చెల్లింపులకు వినియోగించాలి. ఎస్టీ గురుకులాల్లో ఏడాది మొత్తం ఖర్చులకుగాను లక్షా 50వేల రూపాయల వరకు గతంలో ఇచ్చేవారు. గురుకులాల్లో ఇలాంటి ఖర్చులు నెలనెలా ఉంటాయని, వాటిని చెల్లించాలని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది.
ముందు మీరు ఖర్చు పెట్టుకోండి, తర్వాత తీరిగ్గా చెల్లిస్తామన్నట్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొన్ని చోట్ల ఏడాదిగా ఇవి పెండింగ్ ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా నెలల తరబడి చెల్లించడం లేదంటే గురుకులాలపై ఎంతటి దుర్మార్గమైన విధానాన్ని అమలు చేస్తున్నారో అర్థమైపోతుంది. కొన్నిచోట్ల తొలగిస్తామని నోటీసులు కూడా ఇచ్చారు. ఇదీ జగన్ పాలనలో గురుకులాలు ఎదుర్కొంటున్న దైన్య పరిస్థితి.
గురుకులం.. విద్యార్థులకు అందని ఆహారం