ప్రముఖ కవి, సాహిత్యవేత్త గుర్రం జాషువా 50వ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాషువా రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి .. అయన ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరు నడుచుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నగరం నడిబొడ్డున గుర్రంజాషువ కళాపీఠాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. జాషువా కళాపీఠం నిర్మాణానికి, స్మృతివనానికి ఇప్పటికే రూ. 3 కోట్లు నిధులు కేటాయించినట్లు అయన గుర్తుచేశారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదగా జాషువా కళాపీఠం ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
సమాజానికి మేలు చేసే ఎన్నో రచనలు రాసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచనలను.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. జాషువా కళాపీఠం నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన నివసించిన ఇంటిని స్మృతివనంగా తీర్చిద్దిదాలని కోరారు. గుంటూరు జిల్లాలో నూతనంగా ఏర్పడే జిల్లాకు.. గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణరావు, అప్పిరెడ్డి, కల్పలత ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, మధ్యవిమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి, మేయర్ కావాటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.