రోడ్డు ప్రమాదాల నివారణకు విధివిధానాలను తెలుపుతున్న రవాణా అధికారి మీరాప్రసాద్ రహదారి ప్రమాదాలు మృత్యువుకు హేతువుగా మారుతున్నాయి. గుంటూరు జిల్లాలో ప్రమాదాల నివారణకు నడుం బిగించిన జిల్లా యంత్రాంగం.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టింది. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి.... వాటిని నివారించే ప్రక్రియ ప్రారంభించింది.
రోజుకు ఐదు ప్రమాదాలు సగటున ఇద్దరు..
గుంటూరు జిల్లాలో మొత్తం 15 లక్షల వాహనాలుండగా.. వీటిలో 13 లక్షల వాహనాలు ద్విచక్రవాహనాలు, సొంత కార్లే. ప్రమాదాల నివారణకు ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా.. జిల్లాలో రోజుకు కనీసం 5 ప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున రోజుకు ఇద్దరు మృతి చెందుతుండగా... నలుగురు క్షతగాత్రులవుతున్నారు.
2019తో పోల్చిచూస్తే.. గత ఏడాది ప్రమాదాలు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 2019లో 1907 రోడ్డుప్రమాదాల్లో 834 మృతి చెందగా... 2,056 మంది గాయాలతో బయటపడ్డారు. 2020లో 1538 ప్రమాదాలు జరగ్గా... 653 మంది మృతి చెందారు. మరో 1433 మంది క్షతగాత్రులయ్యారు. మొత్తం మీద ప్రమాదాల్లో 19 శాతం... మృతుల్లో 22 శాతం తగ్గింది. ఈ రోడ్డుప్రమాదాలను మరింతగా తగ్గించాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా యంత్రాంగం కసరత్తు నిర్వహించింది.
జిల్లాలో 229 బ్లాక్ స్పాట్లు..
జాతీయ రహదారిపై ప్రధానంగా ప్రమాదాలు జరిగేది కొన్ని ప్రాంతాల్లోనే. వీటినే బ్లాక్ స్పాట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటివి గుంటూరు జిల్లాలో 229 ఉన్నట్లు గుర్తించారు. ఓ రహదారిపై ఓ ప్రాంతంలో 500 మీటర్ల పరిధిలో వరుసగా మూడేళ్లు ప్రమాదాలు జరిగితే... మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తిస్తారు. ఇవి ఎన్నెన్నో కారణాలు. డివైడర్లను అనధికారికంగా తెరవడం, రోడ్డు మలుపులు, సాంకేతిక కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక్కోచోట ఒక్కో సమస్య ఉంటుంది. వీటిని క్రోడీకరించి సమస్య పరిష్కరిస్తే.... రోడ్డుప్రమాదాలు అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు.
'ఇటీవల కాలంలో ఎక్కువగా ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న దుర్ఘటనలే ఎక్కువ. పొగమంచు, ఇతర కారణాలతో ముందున్న వాహనం కన్పించకపోవడంతో కోలుకోలేని అనర్థాలు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాం'
-ఇ.మీరాప్రసాద్, ఉప రవాణా కమిషనర్, గుంటూరు
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రవాణా శాఖ, పోలీసు అధికారులు గుర్తించిన కీలకమైన అంశాలను ఆచరణలోకి తీసుకువస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశముంది.
ఇదీ చదవండి:
పంట పొలాలనూ వదలని ఇసుకాసురులు..!