పవర్ లిఫ్టింగ్.. వెయిట్ లిఫ్టింగ్‌లో యువకుడి సత్తా.. ఒలింపిక్స్‌లో బంగారమే అతని లక్ష్యం..! Young Man in Power Lifting and Weight Lifting: క్రీడల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిప్టింగ్ పోటీలకు ఉండే ప్రత్యేకతే వేరు. వీటి సాధన కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుంది. అలాంటి క్రీడలో పతకాలతో రాణిస్తున్నాడు ఈ యువకుడు. కానీ, ఆర్థిక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనలేకపోతున్నాడు. దాతలు సహకరిస్తే తప్పకుండా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
గుంటూరు జిల్లా ఆనందపేటలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు అబ్దుల్ మతిన్. తండ్రి షేక్ బాకర్ హుస్సేన్. ప్రస్తుతం ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. ఇయనకి చిన్నప్పటి నుంచి కరాటే అంటే చాలా ఇష్టం. దాంతో పట్టుదలతో కృషి చేసి రాష్ట్ర స్థాయి పతకాలు సాధించాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంతకుమించి ముందడుగు వేయలేకపోయాడు హుస్సేన్.
ఆర్థిక కారణాలతో తను సాధించకపోయినా కుమారుడిని మాత్రం క్రీడల్లో మేటిగా తీర్చిదిద్దాలని భావించాడు. తండ్రిని చూస్తూ పెరిగిన మతిన్‌కి కూడా చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. అందుకే పాఠశాల రోజుల నుంచి వ్యాయమాలు చేస్తూ తనను తాను దృఢంగా మార్చుకున్నాడు. అలా పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లపై మక్కువ పెంచుకున్నాడు.
తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు మతిన్. ఇతడి లక్ష్య సాధనకు కోచ్ కమరుద్దీన్ సహకారం తోడైంది. ఫలితంగా క్రీడల్లో ప్రవేశించిన తొలి ఏడాది నుంచే పతకాలు సాధిస్తూ కోచ్ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ఓ వైపు కళాశాల విద్యను అభ్యసిస్తునే.. ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేస్తూ లక్ష్యం దిశగా సాగుతున్నాడు ఈ క్రీడాకారుడు.
పవర్ లిప్టింగ్ పోటీల్లో ఇప్పటివరకు పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజయ పతాకం ఎగురవేశాడు మతిన్. 2020లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల నుంచి.. కేరళలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల వరకు బంగారు, రజత, కాంస్య పతకాలు సాధిస్తునే ఉన్నాడు. క్రీడల్లో మతిన్ విజయాల వెనుక కోచ్ కమరుద్దీన్ పాత్ర చాలా ముఖ్యమైనది. శిష్యుడి కోసం ఈ గురువు తన ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చుకున్నాడు. అంతేకాక ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పుతూ... ఆరోగ్య చిట్కాలను పాటించేలా చేస్తూ వెన్నంటే ఉండి శిష్యుడిని ప్రోత్సహిస్తున్నాడు. మతిన్‌లోని కష్టపడే తత్వమే అతడిని ముందుకు నడిపిస్తోందని చెబుతారాయన.
పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి, శారీరక దారుఢ్యం పెంచుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు మతిన్. కష్టాన్నే నమ్ముకున్న ఇలాంటి క్రీడాకారులను ప్రభుత్వం, దాతలు ప్రోత్సహించాల్సిన అవసరముంది.