ఆగస్టు ఒకటిన బక్రీద్ పండుగని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా.. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. పండుగ సందర్భంగా ముస్లిం మతపెద్దలతో ఎస్పీ సమావేశమయ్యారు. కరోనా కారణంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకోవాలని కోరారు.
ఈద్గాలలో సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని, ఎవరి ఇళ్లలో వారు ప్రార్ధనలు చేసుకోవాలని కోరారు. మసీదులలోనూ 50 మందికి మించకూడదని తెలిపారు. ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఇద్దరి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలన్నారు. నోటిఫైడ్ స్థలాలలో మాత్రమే జంతు వధకు అవకాశముంటుందని... స్లేటరింగ్కు అనుమతించిన జంతువులను మాత్రమే వధించాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించని ప్రదేశాలలో ఎవరూ జంతువులను వధించరాదన్నారు.