ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇడ్లీ ఇస్తే తినలేదని.. దారుణంగా కొట్టి హత్య చేశారు' - Beggar Murder Case

Beggar Murder Case in Guntur:గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో ఈ నెల 1న జరిగిన యాచకుడి హత్య కేసులో నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. మేము ఇచ్చిన ఇడ్లీ తినలేదన్న నేపంతో బిక్షాటన చేసుకునే వ్యక్తిని ముగ్గురు కలిసి కొట్టి హతమార్చినట్లు గుంటూరు సౌత్​ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి వెల్లడించారు.

గుంటూరులో యాచకుడు హత్య

By

Published : May 6, 2022, 5:31 AM IST

ఈనెల 1న గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో జరిగిన యాచకుడి హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తాము ఇడ్లీ ఇస్తే తినలేదని బిక్షాటన చేసుకునే వ్యక్తిని ఈ ముగ్గురు విచక్షణ రహితంగా కొట్టి హతమార్చినట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ జెస్సీ ప్రశాంతి వివరించారు. 'గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఆరు నెలలుగా బిక్షాటన చేసుకుంటూ ఓ వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 1న అర్ధరాత్రి మహేశ్​ బాబు అనే వ్యక్తి మద్యం సేవించి అతని వద్దకు వెళ్లారు. తన వెంట తీసుకొచ్చిన ఇడ్లీ పొట్లాన్ని యాచకుడికి ఇచ్చి తినమన్నాడు. ఈ క్రమంలో ఒరే.. రాత్రి వేళలో చెడ్డీ గ్యాంగ్​లు తిరుగుతున్నాయి.. జాగ్రత. నువ్వు కూడా అచ్చం అలానే ఉన్నావ్ అంటూ.. యాచకుడితో మహేశ్​ గొడవ పడ్డాడు. దీంతో యాచకుడి మహేశ్​ ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరివేశాడు.

ఈక్రమంలో కోపంతో ఊగిపోయిన మహేశ్​.. అతని స్నేహితులు అనిల్, సతీశ్​ కుమార్​తో కలసి 1:30 సమయంలో మళ్లీ బిచ్చగాడి వద్దకు వెళ్లారు. మేము ఇడ్లీ ఇస్తే.. తినవా. నీకు ఎంత పొగరు అంటూ దుర్భాషలాడుతూ బైకుపై ఎక్కించుకొని అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గరు కలిసి యాచకుడిపై విచక్షణ రహితంగా రాళ్లు, కర్రలతో కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. రాళ్ల దెబ్బలకు అతను అక్కడే మృతిచెందాడు. చనిపోయాడని గుర్తించిన ఆ ముగ్గురు.. అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గురువారం నగర శివారులోని వై జంక్షన్ వద్ద అరెస్టు చేశారు' అని డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపర్చిన నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్సైలు, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అభినందించారు.

ఇదీ చదవండి:యువతి అనుమానాస్పద మృతి.. ప్రేమికుడిపై తల్లిదండ్రుల అనుమానం

ABOUT THE AUTHOR

...view details