గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ పోలీసులను ఆదేశించారు. రెండో దశలో ఎన్నికలు జరిగే నరసరావుపేట సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శించి.. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలతో మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలు గుర్తించి..పటిష్ఠ నిఘా ఉంచాలన్నారు.
పోలింగ్ రోజు రూట్ బందోబస్తు, పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసి నిరంతర గస్తీ నిర్వహించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా అలజడులు సృష్టించే వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.