గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెండో దశలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామపత్రాల స్వీకరణ కేంద్రాలను గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో ముందుగా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ, అల్లూరివారిపాలెంలోని నామపత్రాల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇబ్బందులేమైనా కలుగుతున్నాయా అనే అంశాలపై ఆయా కేంద్రాలలోని అధికారులను రూరల్ ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రొంపిచర్ల మండలంలోని నామపత్రాల స్వీకరణ కేంద్రాలను పర్యవేక్షించారు. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండే విధంగా పోలీసులకు రూరల్ ఎస్పీ పలు సూచనలు చేశారు.
'ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు' - నరసారావుపేట వార్తలు
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీసూచించారు. నరసరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామపత్రాల స్వీకరణ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు.
అనంతరం రొంపిచర్ల పోలీస్ స్టేషన్ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. రెండో దశలో నరసరావుపేట సబ్ డివిజన్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తోందని తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్లస్టర్లలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా కేంద్రాల వద్ద పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు. అదేవిధంగా గతంలో ఎన్నికల సమయంలో ఎవరైతే గొడవలకు పాల్పడ్డారో వారిని 9వేల 200 మందిని జిల్లా వ్యాప్తంగా గుర్తించి బైండోవర్లు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఇంతకీ తిరుమల కొండపై సర్పంచి ఎవరు?!