గుంటూరు రోడ్డు పైకి వెళ్తే చాలు.. అడుగడుగునా గతుకులే దర్శనమిస్తాయి. ప్రధాన రహదారా ... కాలనీ రోడ్డా అనేదానితో సంబంధం లేదు. అంతటా ఎత్తుపళ్లాలే...చెప్పుకోవటానికి ఓ కిలోమీటర్ రహదారి కూడా సాఫీగా లేని పరిస్థితి. భూగర్భ డ్రైనేజీ పనులు నగరంలోని రోడ్లకు చిల్లులు పెట్టాయి. డ్రైనేజీ పైపులు వేసేందుకు రోడ్ల మధ్యలో తవ్వారు. సరిగా పూడ్చకపోవటం వలన రహదారులు గుంతలమయంగా మారాయి. ప్రధాన రహదారులు మరమ్మతులు చేసినా మిగతాచోట్ల మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. వందల కోట్ల రూపాయలతో పనులు చేపట్టినా కనీస ప్రమాణాలు పాటించకపోవడం ఈ పరిస్థితి ఏర్పడింది. భూగర్భ డ్రైనేజీ పనులు చేస్తున్న గుత్తేదారు ఆ పనుల్ని మధ్యలోనే ఆపివేయడం వలన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది.
తక్షణ మరమ్మతులకు రూ. 10 కోట్లు
ఇటీవలే గుంటూరు నగరంలో పర్యటించిన మంత్రి బొత్స సత్యనారాయణ రహదారుల పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇంఛార్జి మంత్రి రంగనాథరాజు నిర్వహించిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తక్షణం బాగుచేయాల్సిన అవసరాన్ని గుర్తించి... రోడ్ల మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల చేశారు. ఏపీ పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పథకం కింద ఈ నిధులు మంజూరు చేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారులు... పనుల కోసం తవ్వి వదిలేసిన రోడ్లను బాగు చేసేందుకు ఈ నిధులు ఉపయోగించనున్నారు.