మాచర్లలో జరిగిన ఘటనపై నిష్పాక్షిక విచారణకు సహకరించాలని గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తెదేపా నేతలపై జరిగిన దాడి కేసు విచారణ నుంచి స్థానిక సీఐ దుర్గాప్రసాద్‌ను తప్పించి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబుకి బాధ్యతలు అప్పగించామన్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న గురజాల డీఎస్పీ స్పందించిన తీరుపై బాధితులు విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అధికారి ద్వారానే విచారణ జరిపించడం వల్ల మరింత పకడ్బందీగా నేర నిర్ధరణ చేయవచ్చని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. అందుకే ఆయననే విచారణాధికారిగా నియమించినట్లు వివరించారు. నేరం జరిగిన ప్రాంతంలోనే విచారణ జరగటం సాధారణమని... విచారణకు హాజరయ్యేందుకు ఇబ్బందులుంటే తగిన రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ శాఖ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అప్పటికీ అభ్యంతరాలు ఉంటే బాధితులు ఉన్న ప్రాంతానికే విచారణాధికారి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేస్తారని స్పష్టం చేశారు.
ఈ విషయంలో బాధితులు విచారణకు సహకరించకుండా పోలీస్ శాఖపై ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. రాజకీయ పార్టీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల మాన, ప్రాణ, ధన రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందన్నారు. రాజకీయ అవసరాల కోసం పోలీస్ శాఖపై విమర్శలు చేసి, వ్యవస్థను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరైన చర్య కాదని విన్నవించారు.