ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో గుంతల రహదారులు.. ఇబ్బందుల్లో ప్రజలు - The people of Guntur who are coming to reality

Road Problems In Guntur : గుంతలు పడిన రహదారులు విస్తరిస్తామంటే అక్కడ ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ రహదారులు కాకుండా ఆ గుంతలను విస్తరించారని ఆ తర్వాత ప్రజలకు అర్థమైంది. గుంతలకు తోడుగా రహదారిపై నుంచి లేచే దుమ్ము, సరిగా అందని తాగునీరు, వెలగని విద్యుత్ దీపాలు.. ఇలా కాలనీవాసులకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డును విస్తరణ పేరుతో నగరపాలక సంస్థ తీసుకున్న చర్యలు.. రత్నగిరి కాలనీ వాసులకు కష్టాలు మిగిల్చాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేదేంలేక రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.

guntur people protest for road
గుంటూరులో ఆందోళన

By

Published : Mar 1, 2023, 10:56 AM IST

Road Problems In Guntur : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రత్నగిరి కాలనీ ఇది. గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడి రోడ్లు మోకాలు లోతు గుంతలతో వాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. మీడియా కథనాలు, ప్రజల నుంచి విమర్శలు రావటంతో రహదారి బాగు చేస్తామని అధికారులు ప్రకటించారు. రోడ్డు విస్తరణ చేసి కొత్త రహదారి వేస్తామని చెప్పారు. రత్నగిరి కాలనీలో రహదారి అటు ఇటూ ఇళ్లు, దుకాణాలు తొలగించారు. పరిహారం కింద బాండ్లు మంజూరు చేశారు. అయితే పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. డ్రైనేజీ కాలువల నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. ఇళ్లు తొలగించే సమయంలో తాగునీటి పైపు లైన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు తొలగించారు. దీంతో రత్నగిరిలో తాగు నీటి సరఫరా సజావుగా జరగడం లేదు. ఎలాగోలా ప్రజలు సర్దుకుంటున్నారు. గత వారం రోజులకు పైగా మంచి నీరు రాకపోవడంతో కాలనీవాసులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

గుంటూరులో గుంతల రహదారులు..అవస్థలు పడతున్న ప్రజానికం

తీవ్ర ఇబ్బందుల్లో రత్నగిరి : ప్రభుత్వానికి, నగరపాలక సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరు నెలల నుంచి అరకొర తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని రత్నగిరి కాలనీ వాసులు చెబుతున్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తాగు నీరు లేకుండా ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై లేచే దుమ్ముతో ఇక్కడ నివసించలేని పరిస్థితి ఉందన్నారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

మద్దతు తెలిపిన జనసేన నేతలు : రత్నగిరి కాలనీ వాసులకు జనసేన నేతలు మద్దతు పలికారు. ఇష్టారాజ్యంగా తొలగింపు ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం రోడ్డు వేయకపోవటం దారుణమన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇక్కడి ప్రజలపై కక్ష గట్టారని విమర్శించారు.

అధికారుల చర్చలు.. చర్యలు తీసుకుంటామనీ హామీ :ఆందోళన చేస్తున్న వారితో నగరపాలక సంస్థ అధికారులు చర్చించారు. తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details