స్వచ్ఛత విషయంలో అంతంతమాత్రంగానే ఉన్న గుంటూరు నగరాన్ని.. ఈసారి స్వచ్ఛ పోటీల్లో మెరుగైన స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదివరకే ఇంటింటి చెత్త సేకరణ చేపట్టి.. ఇంటి నుంచే తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఏడాది పాటు తీసుకున్న చొరవతో దాదాపు 30వేల గృహాల్లో హోం కంపోస్టు విధానం అమల్లోకి తీసుకొచ్చారు. మార్కెట్లు, ఇతర ప్రదేశాల నుంచి సేకరించే చెత్త ద్వారా ఎరువు తయారు చేయించి.. పార్కులు, రోడ్ల వెంట మొక్కలు పెంచేందుకు ఉపయోగిస్తున్నారు.
నగరంలో రహదారుల మరమ్మత్తులు, భూగర్భ డ్రైనేజికి సంబంధించిన పనులపైనా అధికారులు దృష్టి సారించారు. రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనులు చేపట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్- 2021లో అత్యుత్తమ స్థానాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.