AT Agraharam name Change in Guntur: రోడ్లు, వీధులు, భవనాల పేర్లు మార్చడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిపోయింది. అయితే, స్థానికుల అభిప్రాయాలతో పాటుగా.. ఆ పేరుకు గల చారిత్రక నేపథ్యాలను, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరు మార్పు అంశంపై గుంటారు జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నగంరంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక ఏటీ అగ్రహారం పేరును ఫాతిమా నగర్‌గా మార్చిన నేపథ్యంలో స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇదే అంశంపై నగర పాలక సంస్థ కమిషనర్ స్పందించారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన తప్పిదమని వెల్లడించారు. కింది స్థాయి ఉద్యోగుల సమన్వయ లోపంతోనే తప్పిదం జరిగిందని కమిషనర్ చేకూరి కీర్తి తెలిపారు.
పేరు మర్పులపై స్పందించిన నగర కమిషనర్: గుంటూరులోని ఏటీ అగ్రహారంలో పేరు మార్పు బోర్డుల వ్యవహారం అవగాహనాలోపంతో జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి తెలిపారు. ఏటీ అగ్రహారం 2 లైన్ సూచిక బోర్డ్ పేరు మార్పుపై ఆమె వివరణ ఇచ్చారు. ఏటీ అగ్రహారం పక్కనే ఉన్న ఫాతిమా నగర్ ఉంటుందని... అక్కడ ఏర్పాటు చేయాల్సిన బోర్డుని పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన కింది స్థాయి సిబ్బంది అవగాహన లోపంతో ఏటీ అగ్రహారంలో పెట్టారని వివరించారు. విషయం తెలిసిన తర్వాత బోర్డుని వెంటనే తొలగించామని కమిషనర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదిక అందించాలని ప్రణాళిక అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజల మనోభావాలకు భిన్నంగా జీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకోదని కమిషనర్ చేకూరి కీర్తి స్పష్టం చేశారు.