Guntur Municipal Corporation Keerthi : గుంటూరు శ్రీనగర్ కాలనీలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం అంతా నిబంధనల మేరకే జరిగిందని.. నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి తెలిపారు. యజమానుల అంగీకరించిన తర్వాతే ఇళ్లు కూల్చినట్లు వివరించారు. ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించలేదన్నారు. ఆందోళన చేసిన వారి ఇళ్లు ఇంకా తొలగించలేదని.. అయితే వారి ఇళ్లు కూడా కూలుస్తారనే భయంతో రోడ్డు విస్తరణను అడ్డుకున్నారని తెలిపారు.
ఇదీ జరిగింది: గుంటూరు శ్రీనగర్ కాలనీ పరిధిలో 6 దశాబ్దాల క్రితం చంద్రయ్య నగర్ ఏర్పాటైంది. ప్రభుత్వం ఇచ్చిన బీ-ఫామ్ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునిపేదలు నివాసం ఉంటున్నారు. 2015 కృష్ణా పుష్కరాల సమయంలో రహదారుల విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లకు నోటీసులిచ్చారు. అమరావతి రోడ్డు నుంచి ఠాగూర్ విగ్రహం వరకు విస్తరించాలని అప్పట్లో నిర్ణయించారు. రోడ్డుకు ఎడమవైపు నిర్మాణాలు తొలగించి.. పరిహారం, స్థలాలకు బాండ్లు ఇచ్చారు. అప్పట్లో కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో.. చంద్రయ్యనగర్ వైపు రోడ్డు విస్తరణ ఆగిపోయింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టారు.
సమయం ఇవ్వాలని కోరిన పట్టించుకోని యంత్రాగం: మంగళవారం సాయంత్రం చంద్రయ్య నగర్‌కు వచ్చిన అధికారులు.. ఇళ్లు తొలగిస్తామని, సామాన్లు తీసుకుపోవాలని నోటిమాటగా చెప్పి వెళ్లిపోయారు. బుధవారం ఉదయమే పొక్లెయిన్లతో కూల్చివేతలు చేపట్టడంతో.. చంద్రయ్య నగర్ నివాసితులు హతాశులయ్యారు. 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ఉన్నఫళంగా ఖాళీ చేయమంటే ఎలాగని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వాలని కోరినా యంత్రాంగం పట్టించుకోలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కూల్చివేతలు కొనసాగించారు. సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఇళ్లు కూల్చివేస్తే రోడ్డున పడతామంటూ జయమ్మ అనే మహిళ పొక్లెయిన్ తొట్టెలో కూర్చుని నిరసన తెలిపారు. కొన్ని ఇళ్ల ప్రహరీలు, మరుగుదొడ్లను నేలమట్టం చేశారు. తెలుగుదేశం నాయకులతో కలిసి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో.. తాత్కాలికంగా కూల్చివేతలు ఆపేశారు.