ఇటీవల ప్రాచుర్యం పొందిన బుల్లెట్ బండి పాటకు ఉల్లాసంగా స్టెప్పులేస్తున్న వీరంతా.. గుంటూరు పారిశుద్ధ్య కార్మికులు. కొవిడ్ కాలం మొదలైనప్పటి నుంచి కొంత ఒత్తిడితోనే కార్మికులు పని చేస్తున్నారు. చాలామంది కరోనా బారిన కూడా పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆందోళన తొలగించి, కార్మికుల్లో ఉత్సాహం నింపేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఆటాపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ విధుల్లోకి రాగానే ఆటపాటలతోపాటు ఏరోబిక్స్ కూడా చేయిస్తున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థలో మూడునెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా రెండు డివిజన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. ప్రస్తుతం 22 డివిజన్లలో నిర్వహిస్తున్నారు. నృత్యాలు చేయించడం వల్ల ఒత్తిడిని జయిచి, ఉత్తేజంతో పని చేస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కార్మికులు సంతోషంగా పనిలో నిమగ్నమయ్యేలా చేయడమే ఆటాపాట కార్యక్రమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.