ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సైకిల్​పై సవారీ.. ఎంత దూరమైన అతనికి నోవర్రీ' - గుంటూరు యూత్ సూపర్ ర్యాండోనియర్

మనం సాధారణంగా సైకిల్​పై ఎంత దూరం వెళ్తాం...? ఏదో ఒకటి రెండు కిలోమీటర్లు.. లేదా పనుంటే నాలుగైదు కిలోమీటర్లు. గుంటూరుకు చెందిన ఓ యువకుడు మాత్రం వందల కిలోమీటర్లు సైకిల్​పై సవారీ చేస్తూ రికార్డులు కొడుతున్నాడు. నిరంతరాయంగా 600 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి సూపర్ ర్యాండోనియర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సైకిల్​తో సహవాసం చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు సాధించిన గుంటూరు యువకుడిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

double super randonneur
డబుల్ సూపర్ ర్యాండోనియర్ కిరణ్

By

Published : Feb 10, 2020, 9:02 AM IST

సైకిల్​పై సవారీ.. ఎంత దూరమైన అతనికి డోన్ట్​వర్రీ

సైకిల్​పై దూసుకెళ్తున్న యువకుని పేరు బొగ్గవరపు శ్రీనివాస కిరణ్. గుంటూరు చెందిన కిరణ్​కు చిన్నప్పట్నుంచీ సైక్లింగ్ అంటే అభిరుచి. అదే ఆ యువకుడికి అంతర్జాతీయస్థాయి గుర్తింపుతెచ్చిపెట్టింది. సైక్లింగ్​పై ఉన్న ఆసక్తితో 2015లో విజయవాడలోని సైక్లింగ్ క్లబ్​లో చేరారు. సైక్లింగ్​ను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అడాక్స్ క్లబ్ ఫారిసన్ గురించి తెలుసుకున్నాడు. ఫ్యారిస్ కేంద్రంగా పనిచేసే అడాక్స్ క్లబ్​కు అనుబంధంగా మన దేశంలో అడాక్స్ ఇండియా ర్యాండోనియర్ క్లబ్ పనిచేస్తుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిరంతరాయంగా సైకిల్​పై ఎక్కువ దూరం ప్రయాణించే పోటీలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా నవంబర్​ నుంచి మరసటి ఏడాది అక్టోబర్ వరకూ ఈ సైక్లింగ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ పోటీల్లో పాల్గొన్న కిరణ్ విజయం సాధించి.. సూపర్ ర్యాండోనియర్​గా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గుర్తింపు పొందిన అతికొద్దిమందిలో కిరణ్ ఒకరు.

డబుల్ సూపర్ ర్యాండోనియర్

అడాక్స్ సంస్థ 5 విభాగాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తుంది. 200 కిలోమీటర్లను 13.5 గంటల్లో, 300 కిలోమీటర్లను 20 గంటల్లో, 400 కిలోమీటర్లను 27గంటల్లో, 600 కిలోమీటర్లను 40 గంటల్లో పూర్తి చేస్తే ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుంది. 200 కిలోమీటర్ల విభాగం పూర్తి చేసిన వారిని ర్యాండోనియర్ అని... 600 కిలోమీటర్లను పూర్తి చేస్తే సూపర్ ర్యాండోనియర్ అని వ్యవహరిస్తారు. కిరణ్ 2018లో 200, 300 కిలోమీటర్ల లక్ష్యాలను పూర్తిచేశారు. ఆ తర్వాత 2019లో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో 200, 300, 400 కిలోమీటర్ల లక్ష్యాలను చేరుకున్నారు. అలాగే విజయవాడ-తుని మార్గంలో 600 కిలోమీటర్ల లక్ష్యం పూర్తిచేశారు. మళ్లీ అదే సంవత్సరంలో రాజమహేంద్రవరం మార్గంలో 200, 300, 400 కిలోమీటర్లు, హైదరాబాద్ మార్గంలో 600 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇలా ఒకే ఏడాదిలో రెండు సార్లు సూపర్ ర్యాండోనియర్ లక్ష్యాన్ని పూర్తిచేశారు. కఠోర సాధనతో పాటు ఆహార నియమాలు పాటించటం ద్వారానే ఇది సాధ్యమైందని కిరణ్ అంటున్నారు.

మరొకరికి ఆదర్శంగా

సైక్లింగ్​పై అవగాహన కల్పించేందుకు కిరణ్ తన వంతు కృషిచేస్తున్నారు. విజయవాడ, అమరావతి ర్యాండోనియర్ క్లబ్​లలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నేటితరం పిల్లలను సైక్లింగ్ వైపు మళ్లేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రాంతానికి సైకిల్​పై సవారీ చేస్తుంటారు. కిరణ్​ను ఆదర్శంగా తీసుకుని ఇంద్రజిత్ అనే మరో యువకుడు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని.. 200, 300, 400, 600 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. తద్వారా సూపర్ ర్యాండోనియర్​గా గుర్తింపు పొందారు. సైక్లింగ్​తో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని కిరణ్​ చెబుతున్నారు. సైకిల్ సవారీని నిత్యజీవితంలో భాగం చేసుకోవటం వలన పర్యావరణ కాలుష్యాన్ని కొంతైనా తగ్గించవచ్చంటున్నారు.

సైక్లింగ్ క్లబ్ ద్వారా సామాజిక అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నారు కిరణ్. పర్యావరణ పరిరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చదవండి :జల సంరక్షణపై యువకుల సైకిల్ యాత్ర

ABOUT THE AUTHOR

...view details