గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు భూ అవకతవకల కేసులో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమన్ కుమార్ అనే నిందితుడిని విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సవరణ చేసిన 9 విక్రయ దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు ఉత్తర మండల డీఎస్పీ దుర్గాప్రసాద్ చెప్పారు.
"2017లో తన మేనల్లుడు శివసాగర్ పేరిట 1.42 ఎకరాల భూమిని నారాయణమ్మ అనే మహిళ రిజిస్టర్డ్ వీలునామా రాసింది. శివసాగర్ చనిపోయాక కొందరి కన్ను ఈ విలువైన భూములపై పడిందని తెలిపారు. నారాయణమ్మ చనిపోయే నెల రోజుల ముందు నకిలీ వీలునామా సృష్టించి పలువురికి ప్లాట్ల కింద భూవిక్రయాలు చేపట్టారు. రూ. 3.83 కోట్ల విలువ గల భూమిని 12 మందికి అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. తనకు జరిగిన అన్యాయంపై శివసాగర్ భార్య పద్మజ పెదకాకాని పోలీసులను ఆశ్రయించగా.. భూ అవకతవకలు బయయపడ్డాయి. ఇందులో కొందరు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. కేసు ఇంకా దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది" అని డీఎస్పీ దుర్గాప్రసాద్ చెప్పారు.