ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యసేవలను వెంటనే అందించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కొవిడ్ పరీక్షల పేరుతో జాప్యం చేయవద్దని సూచించారు. అత్యవసర వైద్యసేవలను విస్మరించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు సర్వజనాసుపత్రిలో 12 ఏళ్ల బాలిక మృతిచెందగా.. వైద్యసేవలు ఆలస్యం కావడం వల్లే చిన్నారి చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్లో మరింత జవాబుదారీతనంతో వైద్యసేవలు అందేటట్లు చర్యలు చేపడతామని తెలిపారు. కరోనా పరీక్షల పేరుతో అమూల్యమైన వైద్య సమయాన్ని వృథా చేయడం భావ్యం కాదని జేసీ అభిప్రాయపడ్డారు. జీజీహెచ్లో సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.