గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోటనెమలిపురి గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి.. 18 ఎకరాల్లో బంతిపూలు సాగు చేశారు. అధిక మొత్తంలో దిగుబడి వస్తే.. వరుస పండుగల నేపథ్యంలో ధరలు బాగా ఉంటాయని ఆశించారు. గంపెడు ఆశలతో.. పూలను మార్కెట్‌కు తీసుకెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. బంతిపూలను అద్దె వాహనంలో మార్కెట్‌కు తీసుకెళ్తే.. కనీసం కొనేవారే కరవయ్యారు. పూలు అమ్ముడుపోక దిక్కు తోచని స్థితిలో.. పేరేచర్ల వద్ద పూలను రోడ్డు పక్కనే పారబోశారు.
రెండు టన్నుల బంతి పూలు కోయడానికి.. కూలీలకు 6వేల 500 రూపాయలు ఖర్చైందని.. మార్కెట్ తీసుకురావడానికి మరో 4వేల 500 వ్యాన్‌కు చెల్లించినట్లు రైతు చెప్పారు. లోడింగ్ ఇతర ఖర్చులు కలిపి రూ. 15వేల వరకు చెల్లించినట్లు తెలిపారు. గుంటూరు మార్కెట్లో కొనుగోలు జరిగే సమయానికి వర్షం రావడంతో పూలు అమ్ముడుపోలేదని.. అందుకే పూలు పారబోసినట్లు రైతు రామాంజనేయులు తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత అయినా ధర వస్తుందో రాదో తెలియదని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయం రాకపోగా కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.