MLA Musthafa Vs Public : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపాకు తన నియోజకవర్గంలో మురుగు కాల్వలు బాగు చేయాలనే ఆలోచన వచ్చింది. పాత గుంటూరులోని బ్రహ్మంగారి గుడి వీధిలో కాలువ పనులకు శంకుస్థాపన చేయాలని భావించారు. అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొబ్బరికాయలు, పూలు సిద్ధం చేశారు. ఆ ప్రాంతంలో మురుగునీరు సరిగా పోక, చెత్త తీయక స్థానికులు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజి కావాలని ఎమ్మెల్యేని అడిగారు. సరేనన్నారు. ఇప్పుడు భూ గర్భ డ్రైనేజికి కాకుండా సైడు కాల్వల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయటానికి రావటంతో వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే అక్కడి వీధుల్లో రెండువైపులా మురుగు కాలువలున్నాయి. వాటిని వెడల్పు చేస్తే రోడ్ల విస్తీర్ణం మరింతగా తగ్గిపోతుంది.
పైగా ఇప్పుడు పనులు మొదలుపెడితే ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. నగరంలో చాలాచోట్ల రోడ్డు విస్తరణ పనులే నెలల తరబడి సాగుతున్నాయి. ఇప్పుడు పనులు ప్రారంభిస్తే... కొద్దిరోజుల్లో వర్షాలు కురిస్తే తమకు ఇబ్బందులు వస్తాయని స్థానికులు ఆలోచించారు. ఎప్పుడు వర్షం కురిసినా నీరు పోయే మార్గం లేక రోడ్లు మునిగి తాము ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. అందుకే కాలువలు వద్దని, భూగర్భ డ్రైనేజి కావాల్సిందేనని తెగేసి చెప్పారు. అయితే మీకు అభివృద్ధి వద్దా అంటూ ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. 9ఏళ్లుగా తమ ప్రాంతంలో ప్రజలు మురుగుతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎందుకు వచ్చారని ప్రజలు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నాశనమైపోతారని శాపనార్థాలకు దిగారు. ఎమ్మెల్యే ముస్తపా తీరుతో మహిళలు అవాక్కయ్యారు.