గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుని ప్రవర్తన విమర్శలకు తావిచ్చింది. స్థానిక రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వృద్ధుడిని 108 సిబ్బంది చూసి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో అడ్మిషన్ ఇవ్వకుండా డ్యూటి డాక్టర్ భాషా కాలయాపన చేశారు. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని... వైద్య సేవలు అందించాలని కోరిన 108 సిబ్బంది పై డాక్టర్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఎవరెవరినో తీసుకువచ్చి వైద్యం చేయాలంటే ఎలాగని నిలదీశారు. పోలీసుల నుంచి అనుమతి పత్రం తేవాలని డిమాండ్ చేశారు.
దీంతో వృద్ధుడిని స్ట్రెచర్ పై ఉంచి 108 సిబ్బంది వెళ్లిపోయారు. గంటకు పైగా ఆ వృద్ధుడు స్ట్రెచర్ పైనే ఉండిపోయాడు. ఆ తర్వాత వేరే డ్యూటి డాక్టర్ వచ్చి అతన్ని పేషంట్ గా చేర్చుకుని చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు మాట్లాడే పరిస్థితులో కూడా లేడు. స్పృహ వస్తే గాని అతని వివరాలు తెలియవని ఆసుపత్రి అధికారులు తెలిపారు. గతంలో కూడా డాక్టర్ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి.