గుంటూరు జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో 50 నుంచి 80 మంది చొప్పున.. తొలిరోజున 2,466 మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. 43,500 డోసులు ఇప్పటికే జిల్లాకు చేరుకోగా.. నిల్వ కేంద్రం నుంచి టీకా తరలింపు పూర్తైంది. డ్రై రన్ సమయంలో డమ్మీ పంపిణీ చేసిన విధంగా.. ఈసారి అసలు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి, చరవాణికి ఓటీపీ పంపించినట్లు అధికారులు తెలిపారు.
వారికి మాత్రమే...
వ్యాక్సినేషన్లో పాల్గొనే వైద్య సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని సంయుక్త కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు.. టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారని చెప్పారు. వైద్య సిబ్బందికి తొలి దశలో టీకాలు అందించనున్నట్లు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్ తెలిపారు.