చేపల వేటకు గుంటూరు జిల్లాలో నిజాంపట్నం హార్బర్ చాలా కీలకమైనది. ఇక్కడ ఏటా రూ. 350 కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. నిజాంపట్నం హార్బర్ ప్రస్తుతం 60 బోట్ల సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇక్కడ 275 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. తుపాన్ల సమయంలో రక్షణ కోసం కాకినాడ, నెల్లూరు, వేటపాలెం తదితర ప్రాంతాల బోట్లు నిజాంపట్నానికి వస్తాయి. బోట్లు నిలిపేందుకు అవసరమైన జెట్టీ సామర్థ్యం లేక ఒకదానినొకటి ఢీకొని దెబ్బతింటున్నాయి.
ప్రతిపాదనలకు ఆమోదం
కొన్నేళ్లుగా హార్బర్ విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అవి ఎట్టకేలకు ఇప్పుడు ఆమోదం పొందాయి. వ్యాప్కోన్ సంస్థ దీనికి సంబంధించి సవివరణ నివేదిక రూపొందించింది. విస్తరణకు కావాల్సిన భూమిని అటవీశాఖ నుంచి సేకరించారు. కేంద్రప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టు క్రింద హార్బర్ విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేయనుంది. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషింగ్ ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. మొత్తం రూ. 341 కోట్ల వ్యయంలో నాబార్డు రూ. 150 కోట్లు రుణంగా ఇవ్వనుంది. మిగతా మొత్తంలో కేంద్రం 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం భరించనున్నాయి.
నాబార్డు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులు
హార్బర్లో 300 మెకనైజ్డ్ బోట్లు నిలిచేలా జెట్టీని విస్తరించనున్నారు. దీంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తారు. సముద్ర ముఖద్వారం నుంచి 500 మీటర్ల మేర మొగ... మరో 500 మీటర్ల మేర పొడవు పొడిగించాలని నిర్ణయించారు. దీనివల్ల హార్బర్ నుంచి సముద్రంలోకి బోట్ల రాకపోకలు సాగించటానికి ఇబ్బందులుండవు. మత్స్య సంపద నిల్వచేయటానికి శీతల గోదామును నిర్మించనున్నారు. హార్బర్లోనే ఆక్వా ఉత్పత్తుల గ్రేడింగ్‌తో పాటు ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు.