గుంటూరు జిల్లా నరసరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను మైనారిటీ, ప్రజాసంఘాలు స్టేషన్‌ను ముట్టడించాయి. అలీషా కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు కొట్టడం వల్లే అలీషా ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల ఎక్సైజ్ సీఐ కొండారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టాలని నినాదాలు చేశారు. నిరసన అనంతరం ఎలీషా కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆయా సంఘాల నాయకులు స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
అసలేం జరిగింది..
దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామానికి చెందిన అలీషా తన కారులో అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్నట్లు గురజాల ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అలీషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనస్తాపం చెందిన అలీషా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలీషా గురువారం రాత్రి మృతి చెందాడు.
మద్యం తరలిస్తున్న వాహనం తమది కాదని చెబుతున్నా వినకుండా పోలీసులు అలీషాను అరెస్ట్ చేశారని.. అతనిపై చేయి చేసుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అలీషా మృతికి గురజాల ఎక్సైజ్ పోలీసులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. దాచేపల్లిలో షేక్ అలీషా మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో ముస్లింలు, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ..ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35% కన్వీనర్ కోటా