గుంటూరు నగరంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిరిధర్ టిడ్కో గృహాల పట్టాలను ఇవాళ పంపిణీ చేశారు. అయితే ఇచ్చినట్లే ఇచ్చి మరలా పట్టాలను వెనక్కి తీసుకోవటం పట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయమై నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ స్పందిస్తూ... లబ్ధిదారుల ఫొటో, ఫొటోపై అధికారి సంతకంతో పట్టాలను పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు.
కొందరి ఫొటోలు లేకుండానే పంపిణీ అయిన కారణంగా వారి నుంచి పట్టాను వెనక్కి తీసుకున్నామని కమిషనర్ పేర్కొన్నారు. టిడ్కొ గృహాలకు సంబంధించి ఇప్పటికే సామాజిక ఆడిట్ పూర్తయ్యిందని చెప్పారు. లబ్ధిదారుల పట్టాలను వారికే అందిస్తామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.