కరోనా కేసులు పెరుగుతున్నందున నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదేశించారు. గుంటూరు కమిషనర్ ఛాంబర్లో వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు, నగరపాలక సంస్థ నుంచి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కరోనా కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఏదైనా ప్రాంతంలో 15 కంటే అధిక కేసులు నమోదైతే ఆ ప్రదేశంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజలు గృహాల్లోనే ఉండాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని కోరారు. బయటకు వచ్చేప్పుడు విధిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించాలని సూచించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు ప్రతి రోజు అవసరమయ్యే నిత్యావసర సరకులను ఇంటింటికి అందించే వ్యాపారులను గుర్తించి, వారి వివరాలను కంట్రోల్ రూమ్, నోడల్ అధికారులకు అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పారిశుధ్ధ్య పనులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన వారి నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, ఏ రోజుకి ఆరోజు సదరు యాప్ ద్వారా ఆన్లైన్ చేయాలన్నారు.