ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాజిటివ్ రేటు 15 శాతం దాటితే.. రాకపోకలు నిషేధం'

గుంటూరులో పట్టణాల్లో కంటే గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికార యంత్రాంగం కట్టడి చర్యలపై దృష్టి సారించింది. పాజిటివ్ రేటు 15శాతం మించితే ఆ గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ స్థాయిలో సర్పంచుల అధ్యక్షతన కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

collector review meeting
collector review meeting

By

Published : May 20, 2021, 8:12 PM IST

గ్రామ స్థాయిలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం వాటి నివారణపై దృష్టి సారించింది. సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతున్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాల్ని మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి అక్కడ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని మండలాల్లో కొవిడ్–19 వార్ రూంలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచిల అధ్యక్షతన కరోనా కట్టడి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

పాజిటివ్ రేటు 15శాతం మించితే ఆ గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలోను, పట్టణ ప్రాంతాలలోను కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు ఫంక్షన్​హాల్స్, పాఠశాలలు, స్వచ్ఛంద సేవా సంస్థల భవనాలను గుర్తించాలన్నారు. ప్రస్తుతం 90శాతం కేసులు జ్వరం రావటంతోనే తెలుస్తున్నందున.. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం అర్హుల వివరాలను పంపించాలన్నారు. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తున్నందున వారి వివరాలు సంబంధిత తహసీల్దార్లు రెండు రోజుల్లో అందించాలన్నారు.

ఇదీ చదవండి

కొవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details