ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు బదిలీ - Guntur Collector Shyamal Anand transferred

గుంటూరు కలెక్టర్​ శ్యాముల్ ఆనంద్​కుమార్ బదిలీ అయ్యారు. ఎస్​ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అతని బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు బదిలీ
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు బదిలీ

By

Published : Jan 26, 2021, 10:26 PM IST

Updated : Jan 27, 2021, 5:04 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు నారాయణ భరత్‌ గుప్తా, ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌లను, తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఎ.రమేష్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారిని సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరుగా అక్కడి జేసీ మార్కండేయులుకు, గుంటూరు జిల్లా కలెక్టరుగా అక్కడి జేసీ దినేష్‌ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీగా చిత్తూరు ఎస్పీ ఎస్‌.సెంథిల్‌ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. వీరి బదిలీ ఉత్తర్వులు అధికారికంగా రాత్రి బాగా పొద్దుపోయాక వెలువడినా మంగళవారం ఉదయమే వారికి సీఎస్‌ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.

గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత... మరే ఇతర అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని, జేసీలకు బాధ్యతలు అప్పగించాలని గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఆ మేరకు చిత్తూరు కలెక్టర్‌ భరత్‌ గుప్తా మంగళవారం సాయంత్రమే జేసీకి బాధ్యతలు అప్పగించారు. గుంటూరు కలెక్టరు నుంచి జేసీ బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాల్ని, హింసాకాండను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ సహా 9మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ ఆదేశించారు. తాజాగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎస్‌ఈసీనే ఇటీవల నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో మంగళవారం సీఎస్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

చిత్తూరు, గంటూరు కలెక్టర్లుగా కొత్తవారిని నియమించేందుకు ఒక్కో జిల్లాకు ముగ్గురు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఎస్‌ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. చాలాకాలం క్రితమే జిల్లా కలెక్టర్లుగా పని చేసి, ప్రస్తుతం ఇంకా ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్‌ అధికారుల పేర్లను ప్రభుత్వం పంపినట్లు సమాచారం. ప్రభుత్వం అధికారుల్ని ఎంపిక చేసిన విధానం సరిగ్గా లేదన్న కారణంతో ఆ ప్రతిపాదనలను ఎస్‌ఈసీ వెనక్కి పంపారని అధికారవర్గాల సమాచారం.

ఇవీ చదవండి:

గణతంత్ర వేడుకలూ దీక్షా శిబిరాల్లోనే...

Last Updated : Jan 27, 2021, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details