ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పంపిణీ చేయనున్న స్థలాల్లో గుంతలు లేకుండా మట్టిని పోయించాలన్నారు. లే అవుట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండలాల వారీగా ప్రస్తుత స్థితిలో ఉన్న పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్లను ఆయన పరిశీలించారు.
అచ్చంపేట, అమరావతి, వట్టిచెరుకూరు, పెదకూరపాడు మండలాల్లో అభివృద్ధి పనుల్లో ఆశించిన స్థాయి పురోగతి లేదని, వాటిపై రోజూ పర్యవేక్షణ జరపాలని ఎంపీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అచ్చంపేట మండలంలో పనుల పురోగతిపై సమీక్ష చేసిన కలెక్టర్, పనులు పెండింగ్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేసారు. త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.