గుంటూరు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు సంసిద్ధంగా ఉండాలని..,వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో డబ్య్లూహెచ్‌వో ఎన్పీఎస్పీ డాక్టర్ హర్షిత్ పవర్ పాయింట్ ప్రజెంటేన్ ద్వారా వ్యాక్సినేషన్ సంసిద్ధత, పంపిణీ విధానాన్ని వివరించారు.
జిల్లా వ్యాక్సినేషన్ కమిటీలో ఇద్దరు ఎస్పీలతోపాటు స్టెప్ సీఈవో, రవాణ శాఖ డీటీసీ, ట్రాన్స్‌కో ఎస్ఈ, డీపీఆర్వోలను సభ్యులుగా చేర్చాలని కలెక్టర్ సూచించారు. మండలస్థాయి కమిటీకి సంబంధిత మండలం తహసీల్దార్ అధ్యక్షత వహిస్తారని వివరించారు. వ్యాక్సిన్ భద్రపరిచేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలన్నారు. వ్యాక్సిన్ ఎలా పంపిణీ చేయాలి, వాహనాల లభ్యత, నిల్వచేయడంలో జాగ్రత్తలు...,తొలుత టీకా ఎవరికివ్వాలనే అంశాలపై అధికారులు పూర్తిగా అవగాహన కలిగిఉండాలని కలెక్టర్ సూచించారు.