గుంటూరు జిల్లా సర్వజనాసుపత్రిలో షార్ట్ సర్క్యూట్‌కు కారణాలు ఏమిటి? విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఎందుకు వచ్చాయి? ఎంసీబీలు ఉన్నాయా? ఉంటే అవి ఎందుకు పని చేయలేదు? నూతనంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో లోడ్ ఎంత ఉందో ఎందుకు అంచనా వేయలేకపోయారు?.. అంటూ జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అడిగిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలపై ఆయన సంతృప్తి చెందలేదు. ఆసుపత్రిలో మొత్తం పంపిణీ వ్యవస్థ తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్తు, రెవెన్యూ, అగ్నిమాపక తదితర ఏడు విభాగాల ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని తెలిపారు.
జీజీహెచ్‌లో బుధవారం రాత్రి కొవిడ్ ఐసీయూకు సమీపంలో మంటలు రావడంతో కలెక్టర్, జేసీ ప్రశాంతి గురువారం ఉదయమే ఆసుపత్రిని సందర్శించారు. వారిద్దరూ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ అగ్నిప్రమాద నివారణ, రక్షణ కోసం ఏర్పాటు చేసిన యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చిన ప్రైవేటు రక్షణ సిబ్బంది, నాట్కో క్యాన్సర్ కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగి అవినాష్‌కు అభినందనలు తెలిపారు.