అత్యంత ఎత్తైన పర్వతాలను ఎముకలు కొరికే చలిలో సైతం ఎక్కేస్తాడు...ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని మరీ శిఖరాలను సునాయసంగా అధిరోహిస్తాడు. ఆ సాహసాలే అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి పెట్టింది. అతనే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాయికిరణ్.
కిలిమంజారో నుంచి...
సాయికిరణ్ ఓ సాధారణ కూలీ కుమారుడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబ వారది. అయితే అతడు అందరిలో ఒకడిలా మిగిలిపోకుండా... అందనంత ఎత్తుకు ఎదగాలనుకున్నాడు. ఎత్తైన పర్వతాలు అధిరోహించి మౌంటెనీర్ కావాలనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నా ముందుకు సాగిన ఆ యువకుడు ఆత్మవిశ్వాసంతో మొక్కవోని దీక్షతో విశ్రమించకుండా అనుకున్న లక్ష్యాలను ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా దేశంలో 5వేల 895 మీటర్ల ఎత్తున ఉన్న కిలిమంజారో పర్వతాన్ని మొదట అధిరోహించి భారత్ జాతీయ జెండాను రెపరెపలాడించాడు. ఆ తర్వాత సిక్కిం రాష్ట్రంలో 6వేల 010 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ టెంగ్విన్ పర్వతాన్ని అవలీలగా ఎక్కేశాడు. అనంతరం లడక్ ప్రాంతంలో 6153 ఎత్తులో ఉన్న స్టాక్ కాంగ్రి పర్వతాన్ని అధిరోహించి... అక్కడ 365 అడుగుల భారత జాతీయపతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో అప్పట్లో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాయికిరణ్ సాధించి...ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.