Telangana Group 1 Exam Dates Released: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు జూన్ 5 నుంచి జరగనున్నాయి. జూన్ 5 నుంచి 12 వరకు ఏడు పరీక్షల తేదీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 25050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. పరీక్షా విధానం, సిలబస్‌ను టీఎస్పీఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. ఇంటర్వ్యూల విధానం తొలగించినందున.. మెయిన్స్‌లో ప్రతిభ ఆధారంగానే గ్రూప్ -1 నియామకాలు ఖరారు కానున్నాయి.
ఒకే భాషలో రాయాలి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, 6న పేపర్-1 జనరల్ ఎస్సే, 7న పేపర్-2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, 8న పేపర్-3 భారత సమాజం, రాజ్యాంగం, పాలన, 9న ఎకానమీ, డెవలప్‌మెంట్, 10న సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా సైన్స్, 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావిర్భావం పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగున్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూల్లో ప్రధాన పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష పూర్తిగా ఒకే భాషలో రాయాలని కమిషన్ స్పష్టం చేసింది.
అలా చేస్తే అర్హత ఉండదు: అన్ని పరీక్షలు రాయాలని.. ఒక్క పేపర్ రాయకపోయినా ఉద్యోగ నియామకానికి అర్హత ఉండదని టీఎస్పీఎస్సీ తెలిపింది. పరీక్షా విధానాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఏడు పేపర్లు మూడు గంటల సమయం, 150 మార్కులతో ఉంటాయి. ఆంగ్లం అర్హత పరీక్షగా ఉంటుంది. రాష్ట్రంలో 503 పోస్టుల కోసం 3 లక్షల 80 వేల 81 మంది దరఖాస్తు చేసుకోగా.. అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2 లక్షల 85 వేల 916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మల్టీజోన్, రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున.. 25 వేల 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. రెండో మల్టీజోన్ అంధ, బధిర మహిళల రిజర్వేషన్‌లో తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో.. ఆ పోస్టులకు 50 మంది చొప్పున ఎంపిక చేయలేకపోయినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. సమానమార్కులు వచ్చిన వారిలో తెలంగాణ స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు కమిషన్ వెల్లడించింది.
రిజర్వేషన్లు ఎలా అంటే: స్థానికుల్లో సమానమార్కులు వస్తే ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొంది. మహిళలకు వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు.. సమాంతర విధానాన్ని అనుసరించినట్లు కమిషన్ వెల్లడించింది. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను బబ్లింగ్ చేయకుండా.. తప్పుడుగా ఉన్నవాటిని మూల్యాంకనం చేయలేదని కమిషన్ పేర్కొంది. ఇంటర్వ్యూల పద్ధతిని ప్రభుత్వం తొలగించినందున.. మెయిన్స్‌లో మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు దక్కనున్నాయి.
గ్రూప్1 మెయిన్స్ పరీక్ష తేదీలు ఇవీ చదవండి: