గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హకీం జానీ... ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మాతృభాషపై మక్కువతో పాతికేళ్లుగా సాహితీ సేవ చేస్తున్నారు. ఉపాధ్యాయునిగా వృత్తిని రచయితగా ప్రవృత్తిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. బాలసాహిత్యంలో ఆయనది అందెవేసిన చేయి. ఇప్పటివరకు రాసిన 65 పుస్తకాల్లో 30 చిన్నపిల్లల కోసమే రాశారు. చిన్నారులకు అవగతమయ్యేలా సరళమైన భాష, పొందికైన పదాలతో ఈయన రచనలు ఉంటాయి.
జాతీయ నాయకుల జీవితకథలు, స్ఫూర్తినిచ్చే ప్రముఖులు, శాస్త్రవేత్తల గురించి పుస్తకాలు రాశారు. 30కి పైగా నీతి కథలతో 'అమ్మఒడి' అనే పుస్తకం రాశారు. ఇందులోని రెండు కథలు మహారాష్ట్రలో తెలుగు మాధ్యమం విద్యార్థులకు పాఠ్యాంశంగా 2019లో ఎంపికయ్యాయి. 'బాధ్యతాయుత పౌరులు' అనే కథను ఈ ఏడాది 11వ తరగతిలో.. 'కొత్తవెలుగు' అనే కథను 12వ తరగతి పుస్తకాల్లో పాఠంగా చేర్చారు. దీనిపై హకీంజానీ సంతోషం వ్యక్తం చేశారు.