ఆగష్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై సాగుహక్కు కల్పించి పట్టాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమత్రి పుష్పశ్రీవాణి, పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతమున్న క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని సీఎం సూచించారు. పట్టాలిచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆ భూముల్లో ఏ పంటలు సాగు చేయాలన్న దానిపైనా ఓ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. దీనిపై వ్యవసాయం సహా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. 'గిరిభూమి' పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.