వాలంటీర్లను గంటకు పైగా నిర్బంధించిన స్థానికులు Grama Volunteer Controversy Issue : వాలంటీర్, సచివాలయ ఉద్యోగులు అత్యుత్సాహం చూపారు. రాత్రి సమయంలో టీడీపీ నాయకుల నేతల ఇళ్లకు వెళ్లి, ఎటువంటి అనుమతి తీసుకోకుండా.. అసలు ఎందుకు వచ్చారో చెప్పకుండానే ఫొటోలు తీశారు. ప్రశ్నిస్తే.. తాము వాలంటీర్లమని, మ్యాపింగ్ చేసేందుకు వచ్చామని చెప్పడంతో ఇంటి యజమానులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని నిర్బంధించారు. చివరకు కార్పొరేషన్ అధికారులు విజ్ఞప్తి చేయడంతో వారిని వదిలిపెట్టారు. మంగళవారం రాత్రి గుంటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఎక్కువ శాతం టీడీపీ నాయకులే నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్లలోకి మహిళా వాలంటీరు వెళ్లారు. కాలింగ్‌బెల్ కొట్టి తలుపు తీసిన వెంటనే.. ఎందుకు వచ్చారో చెప్పకుండా, ఆలస్యం చేయకుండా వారి ఫొటోలు తీశారు. బయోమెట్రిక్ ద్వారా ఆధార్ డేటాబేస్ ఆధారంగా సమాచార సేకరణకు ప్రయత్నించారు. ముందుగా కార్పొరేషన్ మాజీ ఫ్లోర్‌లీడర్ బంధువుల గృహానికి వెళ్లారు. వాలంటీర్ ఫొటో తీస్తుంటే ఎందుకు తీస్తున్నారని ఆమె ప్రశ్నించి వాలంటీర్‌ను బయటకు పంపారు. తరువాత మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన వాలంటీరు ఆయన భార్య ఫొటో తీసేందుకు ప్రయత్నం చేసింది. ఆమె వారిపై మండిపడ్డారు.
తాను వాలంటీర్‌నని, 'జగనన్న సురక్ష పథకం' కింద మ్యాపింగ్ చేస్తున్నామని, అందుకే ఫొటోలు తీస్తున్నానని మహిళా వాలంటీరు చెప్పుకొచ్చారు. ఇక్కడ వాలంటీర్లతో పనేమీ లేదని మాజీ ఎమ్మెల్యే భార్య ఆమెను మందలించారు. ఈ విషయం ఆమె తన సోదరుడికి చెప్పగా.. ఆయన స్థానికులతో కలిసి వారిని గంటకు పైగా నిర్బంధించారు. కొద్దిరోజుల క్రితమే ఆధార్ వివరాలు సేకరించారని...మళ్లీ ఎందుకు వచ్చారంటూ అపార్ట్‌మెంట్ వాసులు వారిని నిలదీశారు. ఇంతలో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అక్కడికి వెళ్లి వాలంటీర్‌ను వదిలేయాలని కోరారు. దానికి వారు నిరాకరించారు. అక్కడికి వెళ్లిన సచివాలయ ఉద్యోగులకు కూడా అక్కడ నుంచి కదలనీయలేదు. పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉండటంతో గంటకు పైగా వారిని అక్కడే కూర్చోబెట్టారు.
అనుమతి లేకుండా వచ్చి వివరాలు అడుగుతారా? : సచివాలయం ఏఓ టీడీపీ నాయకులకు ఫోన్ చేసి.. వాలంటీర్, సచివాలయ ఉద్యోగులను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ అనుమతి లేకుండా.. తమ ఇళ్లకు వచ్చి 'జగనన్న సురక్ష పథకం' అంటూ వివరాలు ఎలా అడుగుతారని టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ సంక్షేమ పథకాలు పొందేవారు ఎవరూ లేకున్నా ప్రతి సారీ వచ్చి ఎందుకు వివరాలు తీసుకుంటున్నారని నిలదీశారు. ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ వారికి ఇదొక ఎత్తుగడ అని వారు ఆరోపించారు. చివరకు గంట తర్వాత వాలంటీరు, సచివాలయ ఉద్యోగులకు మంచినీళ్లు, కాఫీ ఇచ్చి వదిలిపెట్టారు.