లాక్డౌన్ వేళ.... వలస కార్మికుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి కరవై... సుదూర ప్రాంతాల్లోని సొంతూళ్లకు కాలినడకనే పిల్లాపాపలతో, మోయలేని భారంతో పయనమైన దయనీయ పరిస్థితులు అందరినీ కంటతడి పెట్టించాయి. మండే ఎండలు.... కాలే కడుపులతో.... వందలాది కిలోమీటర్ల మేర వారు సాగించిన పయనం...అంతులేని ఆవేదనను నింపింది. వీరి సమస్యను ఈటీవీ-ఈనాడు, ఈటీవీ భారత్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి... వారి ఇబ్బందులను వెలుగులోకి తీసుకువచ్చారు. స్పందించిన ప్రభుత్వం సమీక్ష నిర్వహించి వలసకూలీల సంక్షేమానికి చర్యలు చేపట్టింది.
నడిచి, సైకిళ్లు, ట్రక్కులపై వెళ్లకుండా వారిని ఆపి తాత్కాలికంగా శిబిరాలకు తరలించి ఉపశమనం కల్గిస్తున్నారు అధికారులు. జాతీయ రహదారిపై వారికి అర్థమయ్యే రీతిలో హిందీ, ఒరియా, బెంగాళీ, తమిళం, కన్నడ భాషల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వారికి వివరించి శిబిరాలకు తీసుకువచ్చి భోజనం, తాగునీరు అందిస్తున్నారు. ఒడిశాకు బస్సులపైన పంపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు శ్రామిక రైళ్ల ద్వారా వలస కార్మికులను పంపుతున్నారు. ఒక రైలులో 1600 మంది వరకు ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. రహదార్ల పక్కనే డాబాలు తెరిపించి అన్నపానీయాలు అందించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇన్నాళ్ల తమ సమస్యలను ఏకరువు పెడుతున్న వలస కార్మికులు.... ఎట్టకేలకు స్వస్థలాలకు పంపడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.