Household Mapping: హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ నుంచి కుటుంబాల విభజనకు అనుమతించిన ప్రభుత్వం.. ఇందుకు మ్యారేజి సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. వివాహ ధ్రువీకరణ కోసం 20-30 ఏళ్ల కిందట పెళ్లయిన వారు అనేక రకాల అవస్థలు పడుతున్నారు.. దాని కోసం వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లినాటి ఫొటో, జనన ధ్రువీకరణ వంటివి సమకూర్చితే తప్ప స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మ్యారేజి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. 2019లో చేసిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ నుంచి కుటుంబాల విభజన ప్రక్రియను కడప నగరపాలక సంస్థతోపాటు విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు.
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖను ఆదేశించింది. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ చేసిన కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా అప్పటివరకు ఆ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపేశారు. కుమారుడు ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలతో వేరేక చోట ఉంటున్నా.. తల్లిదండ్రులను సంక్షేమ ఫలాల జాబితానుంచి తొలగించారు.
హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో అందరినీ ఒకే కుటుంబంగా ఇప్పటికీ చూపించడమే దీనికి కారణం. మ్యాపింగ్‌నుంచి కుటుంబాలను విభజించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మళ్లీ అర్హత సాధించగలరు. తల్లిదండ్రులు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే.. నిరుద్యోగి అయిన కుమారుడి కుటుంబం పథకాలకు అర్హత సాధిస్తుంది.