రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదం, రాజ్యాంగ విరుద్ధమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయం విభజన చట్టానికి కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే అమరావతి ఐకాస పిలుపు మేరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని వెల్లడించారు.
మడమ తిప్పారు
ఇవాళ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం, రాజ్యాంగ విరుద్ధం. ఇది విభజన చట్టానికి కూడా వ్యతిరేకం. కరోనా వ్యాప్తి వేళ ఇలాంటి నిర్ణయం ఏమిటి?. క్లిష్ట పరిస్థితుల్లో చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ చరిత్రలో 3 రాజధానులు ఎక్కడా లేవు. రాజధాని బిల్లుకు మద్దతిస్తున్నానని జగన్ ఆరోజు సభలో చెప్పారు. జగన్ మడమ తిప్పి రాష్ట్రానికి ద్రోహం చేశారు. ప్రజా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు- చంద్రబాబు
ప్రజాభిప్రాయం కోరండి
గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం. రాజకీయాలు కక్షలు తీర్చుకునేందుకు కాదు. అనుభవం ఉన్న నాయకుడిగా అందరి క్షేమాన్ని కాంక్షించి చెబుతున్నా ప్రజలు ముందుకు రాకుంటే భావితరాలకు తీరని నష్టం చేసిన వాళ్లం అవుతాం. అమరావతిని నాశనం చేయాలనే యోచన జగన్‌కు ఎందుకు వచ్చింది?. రాజధాని మార్చిన చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా ఉందా? 3 రాజధానులపై ప్రజాభిప్రాయం కోరుతూ ఎన్నికలకు వెళ్లాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఒప్పుకుంటే ఇక నేనేమీ మాట్లాడను. - చంద్రబాబు