గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్: కృష్ణ మరణం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా... తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి.. సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి... సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్‌స్టార్ కుటుంబసభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్: సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం ప్రకటించారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లూరి సీతారామరాజు పాత్రతో చిరస్థాయిగా నిలిచిపోయారని వెల్లడించారు. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్ అని తెలిపారు. నిజ జీవితంలోనూ మనసున్న మనిషి కృష్ణ అంటూ పేర్కొన్నారు. కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి, తెలుగువారికి తీరని లోటు వెల్లడించారు. కష్ట సమయంలో కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.
వెంకయ్యనాయుడు:కృష్ణ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం అని పేర్కొన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్: అభిమానులు సూపర్‌స్టార్‌గా పిలుచుకునే ఘట్టమనేని కృష్ణ కన్నుమూతపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు: సూపర్‌స్టార్ కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణ చేసిన కృషిని ప్రస్తావించారు. కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసినట్లందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోవడం మహేశ్‌కు తీరని వేదనేనని.. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యం ఆయన కుటుంబీకులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.