Government Does Not Pay Private School Fees: విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. ప్రైవేటు స్కూల్స్‌లో పేద విద్యార్థులకు ఈ చట్టం ద్వారా 25శాతం సీట్లు కేటాయించి, ప్రభుత్వమే ఆ ఫీజులను చెల్లించాలి. కానీ ఈ ఫీజుల చెల్లింపు నుంచి తప్పించుకునేందుకు విద్యా హక్కు చట్టం నిబంధనలకే రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నిధుల నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ తల్లిదండ్రులపైనే ఆ భారం నెట్టింది.
విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు బడుల్లో చేరే పేదపిల్లల ఫీజులను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. తల్లిదండ్రులే ఆ ఫీజులు చెల్లించాలి. అందుకు అనుగుణంగా విద్యాహక్కు చట్టం నిబంధనలకే ప్రభుత్వం సవరణ తెచ్చింది. విద్యాహక్కు చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం 2011 మార్చి 3న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సవరణలు చేసింది. విద్యాహక్కు చట్టంలోని నిబంధన-10లోని సబ్ రూల్ 6 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తరఫున రెండు విడతల్లో ప్రభుత్వమే ఫీజులను చెల్లించాలి.
ఈ మేరకు పాఠశాలల ప్రత్యేక బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్రతి ఏటా సెప్టెంబరు నెలలో మొదటి విడతగా 50శాతం.. జనవరిలో మిగతా ఫీజును ఇవ్వాలి. ఈ నిబంధనకు సవరణ చేసిన ప్రభుత్వం.. అమ్మఒడి కింద ఇచ్చే డబ్బుల నుంచి తల్లిదండ్రులు చెల్లించాలనే నిబంధన చేర్చింది. విద్యా సంవత్సరం ముగింపులో ఇచ్చే అమ్మఒడి నుంచే పాఠశాలలు ఫీజులను వసూలు చేసుకోవాలని పేర్కొంది. అమ్మఒడి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడిన 60 రోజుల తర్వాత కూడా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వమే ఫీజును చెల్లించి, ఆ తర్వాత సంవత్సరం అమ్మఒడి నుంచి మినహాయించుకుంటుందని ప్రభుత్వం పేర్కొంది.