ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ఖజానాని.... సర్వం అమూల్‌కే సమర్పిస్తున్న ప్రభుత్వం

Amul: పాడి రైతుల కోసమే అమూల్‌ను రాష్ట్రానికి తెచ్చామని, రైతులకు ఎంతో మేలు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌.. మొత్తం రాష్ట్రాన్ని గుజరాత్‌ మిల్క్‌ యూనియన్‌కు చెందిన బనాస్‌కాంత, శబర్‌కాంత, కైరా పాల సంఘాలకు కట్టబెట్టారు. తనతోపాటు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, వివిధ ప్రభుత్వశాఖల సిబ్బంది, పశు వైద్య సహాయకులు, వాలంటీర్లనూ... అమూల్‌ కోసం పాల సేకరణలో తరించమంటున్నారు. అమూల్‌ కంటే ఇతర డెయిరీలే రైతులకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నాయి. అయినా తాము మెచ్చిందే అమూల్‌ అన్నట్లుగా ముఖ్యమంత్రి ఎందుకింత ఆపేక్ష చూపిస్తున్నారన్న విమర్శలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Milk collection in villages for Amul
రాష్ట్ర ఖజానాని.... సర్వం అమూల్‌కే సమర్పిస్తున్న ప్రభుత్వం

By

Published : Jan 12, 2023, 7:19 AM IST

Updated : Jan 12, 2023, 8:45 AM IST

Amul: అమూల్‌ కోసం 9 వేల 899 గ్రామాల్లో పాల సేకరణ కోసం మహిళా సహకార సంఘాల ఏర్పాటు చేశారు. అమూల్‌కు పాలు పోయించాలని సభ్యులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల భవనాల నిర్మాణాలు వంటి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం తరపున 3 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తున్నారు. పాల నాణ్యతను పరిశీలించి, సేకరించే నిమిత్తం... ఒక్కోటి 12.81 లక్షల రూపాయల వ్యయంతో... 11 వేల 711 గ్రామాల్లో ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లను ప్రభుత్వమే అమూల్‌కు అందిస్తోంది. ఒక్కో యూనిట్‌కు భవనాల నిర్మాణం కోసం.. 3.50 సెంట్ల స్థలం కేటాయించింది. బీఎంసీయూ, ఏఎంసీయూలకే ప్రభుత్వం సుమారు 2 వేల 500 కోట్లకుపైగా వ్యయం చేస్తోంది. ఇందులో 13 వందల 60 కోట్లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి అప్పు తీసుకుంటోంది. ఇందులో 2.5 శాతం రాయితీగా పోను... 4 శాతం వడ్డీ చెల్లించాలి. పాల ఉత్పత్తుల అమ్మకానికి హబ్‌ల కోసం నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, రహదారుల పక్కన స్థలాలిస్తున్నారు. 2020 డిసెంబరులో ప్రారంభమైన పాల సేకరణ.. ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించినా.. పెద్ద ఎత్తున ప్రభుత్వ సిబ్బందితో పని చేయిస్తున్నా.. రోజువారీ సేకరణ 1.70 లక్షల లీటర్లకు మించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌కు అప్పనంగా అన్నీ కట్టబెడుతుండటం వెనుక ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు.

రాష్ట్రంలోని డెయిరీలు... తమ లాభాల నుంచి బోనస్‌తోపాటు వైద్య సేవలు, తక్కువ ధరకే దాణా, మేలు జాతి పశువుల వీర్యాన్ని తక్కువ ధరకే ఇస్తున్నాయి. రైతులకు, పశువులకు బీమా.., పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. అమూల్‌ ఏడాదిలో 180 రోజులు పోసిన వారికి నామమాత్రపు ఇన్సెంటివ్‌తోపాటు రాయితీపై దాణా మాత్రమే అందిస్తోంది. అమూల్‌కు పాలసేకరణ లక్ష్యం అధికారులకు తలనొప్పిగా మారింది. ఉదయం లేవగానే.. గ్రామ సచివాలయాల్లోని పశు వైద్య సహాయకులతో... పాల సేకరణపై ఆరాలు తీయడం... జిల్లా కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, పశు సంవర్ధకశాఖ అధికారులు, వైద్యుల దినచర్యగా మారింది. రైతులు అమూల్‌కు పాలు పోయకపోతే అధికారులకు నిద్రపట్టే పరిస్థితి లేదు. చేసేది లేక కొందరు మండలస్థాయి అధికారులు... బయటి డెయిరీల్లో పాలు కొని.. అమూల్‌కు పోస్తున్న సందర్భాలూ ఉన్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యమంత్రి చెబుతున్నంత గొప్ప ధరలేమీ... అమూల్‌కు పాలు పోస్తున్న పాడి రైతులకు... దక్కడం లేదు. సగటు వెన్న శాతం 6.8, ఎస్​ఎన్​ఎఫ్​ -8.7 శాతం ప్రకారం చూస్తే... ఇప్పుడు అమూల్‌... గేదె పాలకు లీటర్‌ 47 రూపాయల 50 పైసలు ఇస్తోంది. ప్రోత్సాహకాలతో కలిపినా ఇది 49 రూపాయలకు మించదు. అదే కృష్ణా మిల్క్‌ యూనియన్‌ లీటర్‌కు 53 రూపాయల 4 పైసలు.., బోనస్‌ 5 రూపాయలతో కలిపి.. 58 రూపాయలకు పైనే చెల్లిస్తోంది. కృష్ణా జిల్లాలోని తేలప్రోలు పాల సంఘం తమకు వివిధ రూపాల్లో వచ్చే లాభాల నుంచి బోనస్‌గా గత ఏడాది... లీటర్‌కు 5 రూపాయల చొప్పున చెల్లించింది. సేకరించే పాలకు ధర పెంచి ఇస్తోంది. ఇవన్నీ కలిపితే.. అమూల్‌ ఇచ్చే ధర కంటే లీటర్‌కు.. 15 రూపాయలకు పైనే ఎక్కువగా లభిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అమూల్‌కు పాల సేకరణ ప్రారంభించి 25 నెలలు దాటినా.. రోజువారీ వస్తున్నది లక్షా 70 వేల లీటర్ల లోపే. పశు సంవర్థకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి సంస్థలతోపాటు.. వాలంటీరు నుంచి జిల్లా కలెక్టరు వరకూ అంతా జగనన్న పాల వెల్లువలో తరిస్తేనే ఆ మాత్రమైనా వస్తున్నాయి. రాష్ట్రంలోని విజయ విశాఖ డెయిరీ 9 లక్షల లీటర్లు, సంగం డెయిరీ 6 లక్షల లీటర్లు, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ 3.50 లక్షల లీటర్ల చొప్పున రోజూ సేకరిస్తున్నాయి.

ఏదైనా సంస్థ కొత్తగా పాల వ్యాపారం ప్రారంభించాలంటే... భూములు కొని, అందులో భవనాలు, యంత్రాలతోపాటు.. గ్రామస్థాయిలో సేకరణ వ్యవస్థ, పాల నిల్వకు కూలింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కలిపితే... లీటరుకు సగటున 10 రూపాయల వరకు నిర్వహణ వ్యయం అవుతుంది. అయితే గుజరాత్‌కు చెందిన 3 సహకార సంఘాలకు... మన రాష్ట్ర ప్రభుత్వమే పాల సేకరణతోపాటు సుమారు 3 వేల కోట్ల రూపాయలతో ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ పాయింట్లు, పాల నిల్వకు బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్యకు చెందిన డెయిరీ భూములు, భవనాలు, యంత్రాల్ని 99 ఏళ్ల లీజుపై అప్పగిస్తోంది. అలాంటప్పుడు అమూల్‌.. రాష్ట్రంలోని ఇతర డెయిరీల కన్నా లీటరుకు కనీసం 10 రూపాయలు ఎక్కువే ఇవ్వొచ్చని సహకార డెయిరీల యాజమాన్యాలు అంటున్నాయి. తమకూ అలా ప్రభుత్వమే పాలు సేకరించి.. నిల్వ సౌకర్యాలు సమకూరిస్తే లీటరుకు 10 రూపాయలు ఎక్కువే ఇస్తామంటున్నారు.

అమూల్‌ ఒక సహకార సంస్థ అని.., అందులో మన రైతులూ సభ్యులేనని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. గుజరాత్‌కు చెందిన సంఘాల సమావేశాలకు మన రైతుల్ని పిలుస్తారా? అక్కడి రైతులకు ఇచ్చినట్లే బోనస్‌ ఇస్తారా? అంటే సాధ్యం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఇన్సెంటివ్‌ చెల్లించే అవకాశమే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు దొడ్డిదారిన అమూల్‌ను తెచ్చి.. దేశంలో మరెక్కడా లేని విధంగా వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో అధిక శాతం డెయిరీలు కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం సానుభూతిపరుల చేతుల్లో ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సహకార డెయిరీలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసినా.. యాజమాన్యాల న్యాయ పోరాటంతో కుదరలేదు. మళ్లీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక అమూల్‌ను రంగంలోకి దింపి.. అన్నీ తామై నడిపిస్తోంది. సహకార డెయిరీలను దెబ్బతీసే కుట్రపూరిత ఆలోచనలతోనే ఇదంతా చేస్తోందని ప్రభుత్వ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేసులు పెట్టి అరెస్టు చేయడంతోపాటు.. కొన్ని డెయిరీలను త్వరలో స్వాధీనం చేసుకుంటామని మంత్రులే ప్రకటిస్తుండటం ఇందుకు నిదర్శనం. హెరిటేజ్‌తోపాటు రాష్ట్రంలోని సహకార డెయిరీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆరోపించారు.

రాష్ట్ర ఖజానాని.... సర్వం అమూల్‌కే సమర్పిస్తున్న ప్రభుత్వం

ఇవీ చదవండి:

Last Updated : Jan 12, 2023, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details