Government Actions for Allotment of Places: అమరావతి ఆర్-5 జోన్ ప్రాంతంలో.. గుంటూరు, NTR జిల్లాలకు చెందిన పేదలకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల అధికార యంత్రాంగం 49 వేల మంది లబ్ధిదారులను గుర్తించటంతో పాటు.. వారి పేర్లతో ఇళ్ల ప్లాట్లకు సంబంధించిన పుస్తకాలను ముద్రించింది. ఇళ్ల పట్టాలను సంబంధిత రెవిన్యూ అధికారులకు అందజేశారు. తదుపరి ప్రక్రియ కోసం జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని ప్రారంభించింది. గతంలోని లబ్ధిదారుల జాబితాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అర్హులకు పట్టాలిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
NTR జిల్లాలో 24 వేల మంది, గుంటూరు జిల్లా పరిధిలో 25 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో తుళ్లూరు మండలం నుంచి కేవలం 1340 మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. జాబితాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం రూపొందించినా అప్పట్లో కోర్టు తీర్పుతో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి.. గెజిట్ జారీ చేసిన అనంతరం మళ్లీ పట్టాల పంపిణీ ప్రక్రియ చేపట్టింది. దీనిని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.
"ఆర్5 జోన్‌ను ప్రశ్నిస్తూ కోర్టుకు వెళ్లాం. అలాగే జీవో నెం 45ను ప్రశ్నిస్తూ కోర్టుకెళ్లాం. వాటిపై హైకోర్టు విచారణ చేపడుతోంది. కానీ ప్రభుత్వానికి అత్యుత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే హైకోర్టు కాని, సుప్రీంకోర్టు కాని తమ వాదనలు ఎక్కడ కొట్టివేస్తాయో అనే భయం. వైసీపీ లక్ష్యం ఒక్కటే.. అధికారం కోల్పోయినా కానీ అమరావతి రాజధానిని నాశనం చేయాలని"-రాజధాని రైతులు