Admissions Reduced in Government Schools: "మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశాం. ప్రభుత్వంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు 37 లక్షల నుంచి 44 లక్షలకు పెరిగారు.” అంటూ గతేడాది సెప్టెంబర్ 20 శాసనసభలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ..అవును నిజమే.. సమూలంగా మార్చేశారు. ఎంతగా అంటే ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసి.. 9నెలలు గడవక ముందే 6.41 లక్షల మంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయే అంతగా మార్చేశారు. అశాస్త్రీయమైన విధానాలతో పిల్లలు వెళ్లిపోయేలా పొగబెడుతున్నారు. 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,29,569 మంది విద్యార్థులు ఉంటే.. ప్రస్తుతం విద్యాసంవత్సరంలో 37.88లక్షలకు పడిపోయింది.
గత రెండేళ్లుగా ప్రభుత్వ బడులకు వచ్చే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. పిల్లల్ని ఎందుకు ఆకర్షించలేకపోతోంది..? సంస్కరణలు బాగుంటే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగాలి కదా? ఎందుకు తగ్గిపోతున్నారు? కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులను కొనసాగేలా ఎందుకు చూడలేకపోయారు..? గత సంవత్సరం 3.98లక్షల మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయినా.. 2018-19 ఏడాది విద్యార్థులతో పోల్చితే విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు అదనంగా ఉందంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది.
ఈ సంవత్సరం మరి కొంత తగ్గి చివరికి 2018-19లో ఉన్న 37లక్షలకే చేరింది. 2023-24లో ప్రవేశాలు ముగింపునకు చేరాయి. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు 37.88లక్షలుగా నమోదవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2019-20లో 38.18 లక్షలు ఉండగా.. ఇప్పుడు 30వేలు తగ్గారు. పిల్లల సంఖ్యను పెంచి చూపించేందుకు గతంలో ఎప్పుడో బడి మానేసిన పిల్లల్నీ రిజిష్టర్లలో నమోదు చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధనంటూ 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత స్కూల్స్‌లో కలిపేశారు. ఇలాంటిచోట బడుల దూరం పెరిగిపోయింది. మరోపక్క గ్రామంలోని బడి 1, 2 తరగతులకే పరిమితమైపోయింది. స్టూడెంట్స్ సంఖ్య తక్కువగా ఉన్నచోట సబ్జెక్టు టీచర్లను ఇచ్చేందుకు ఎన్నో నిబంధనలు పెట్టారు. ఇవన్నీ విద్యార్థుల చదువుకు ఇబ్బందిగా మారాయి.
ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో 9 వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి. ఒక్కో స్కూల్‌కు ఇద్దరు ఉపాధ్యాయులను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. పోస్టులను తగ్గించుకునేందుకు సర్దుబాటు చేసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 234 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఈ పాఠశాలల్లో ఇప్పుడు కేవలం 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయి. కొత్తగా పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రులు రెండేళ్ల కోసమే ఇక్కడ చేర్పించడం ఎందుకని భావించి సమీపంలోని ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 3 లక్షల 6 వేల533 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 2 లక్షల 36 వేల 36 మంది మాత్రమే ఉన్నారు.