ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మంగళగిరిలోని లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధిని ప్రణాళికల్లో భాగంగా.. మంగలాద్రి చుట్టూ గిరిప్రదక్షిణం కోసం రహదారి, కొండపైకి రోప్ వే నిర్మాణం ద్వారా అధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలను కూడా అభివృద్ది ప్రణాళికల్లో చేర్చారు.

mangalagiri development
మంగళగిరి పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు

By

Published : Dec 11, 2020, 7:27 PM IST

రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న పట్టణం మంగళగిరి. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో పాటు గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో ఉండటంతో ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళగిరి, తాడేపల్లి పురపాలికలతో పాటు వాటి సమీపంలోని గ్రామాలను అనుసంధానిస్తూ.. అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రహదారులు విస్తరణతోపాటుగా మంగళగిరిలో మౌళిక వసతులు అభివృద్ధి చేసే క్రమంలో రూ.3 కోట్ల వ్యయంతో 6 ప్రాంతాల్లో కమ్యూనిటి హాళ్లు నిర్మిస్తున్నారు.

మారనున్న మంగళగిరి రూపురేఖలు..

ఎక్కువగా స్వర్ణకారులు, చేనేత కళాకారులున్న మంగళగిరిలో.. స్వర్ణకారుల భవనం, చేనేత భవనం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. రెండు పట్టణాల్లో పార్కులను అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణకు ఏర్పాట్లు చేయనున్నారు. తాడేపల్లి నుంచి రేవేంద్రపాడు వరకు వంద అడుగుల రోడ్డు, బకింగ్ హామ్ కాలువపై నాలుగు చోట్ల వంతెనలు.. అలాగే కుంచనపల్లి నుంచి చిర్రావూరు వరకు నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు. ఈ పనులతో మంగళగిరి రూపురేఖలు మారతాయంటున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు.
పానకాల స్వామికి ప్రత్యేక ప్రణాళిక..
పట్టణంలో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన లక్ష్మినరసింహస్వామి కొండపై ఉన్న పానకాల స్వామి ఆలయాలకు కూడా ప్రత్యేక బృహత్ ప్రణాళిక రూపొందించారు. అభివృద్ది చేయాల్సిన ప్రాంతం ఎక్కువగా రిజర్వు ఫారెస్టుగా ఉండటం.. పూర్తి బాధ్యతలు అటవిశాఖకు అప్పగించారు. దీంతో ఇక్కడ 50 ఎకరాల్లో ఎకో పార్కుని ఏర్పాటు చేయనున్నారు. లక్ష్మీ నరసింహుడి సందర్శనకు వచ్చేవారితోపాటుగా.. రాజధాని ప్రాంతానికి వచ్చే వారు కూడా సేద తీరేందుకు ఈ పార్కు ఉపయోగపడనుంది. అధ్యాత్మికంగా ప్రాధాన్యం ఉండే మొక్కలను.. వివిధ రకాల ఔషధ మొక్కలు కూడా పార్కులో పెంచేందుకు చర్యలు చేపట్టారు.

గిరి ప్రదక్షిణకు ఉపయోగపడేలా కాలినడక మార్గం..

కొండ చుట్టూ 3.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయపు నడకతో పాటు.. పానకాల స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ మాదిరిగా కూడా ఉపయోగ పడే విధంగా ప్రణాళికను రూపోందించారు. రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో కొండపై ఉన్న నెమళ్లు, జింకలు వంటి అటవీ జంతువుల మనుగడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేపడుతున్నారు.

నవనారసింహక్షేత్రం నిర్మించాలని..

కొండ మీద పానకాలస్వామి, కొండ శిఖర భాగాన గండాలయ స్వామి కొలువై ఉన్నారు. దీంతో అక్కడే నవనారసింహక్షేత్రం నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు మాడవీధులతోపాటు కేనేరును అభివృద్ధి చేస్తున్నారు. గుడి ఎదురుగా 25లక్షలతో కళావేదిక నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కొండపైకి ఇప్పటికే మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డు ఉండటంతో.. వాటికి తోడుగా రోప్‌ వే ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

12 వందల కోట్ల వ్యయంతో నివేదిక..

మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను మోడ్రన్ మున్సిపాటిలుగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో 12 వందల కోట్ల రూపాయలు వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

అమరావతి పరిరక్షణ కోసం.. రేపు మహాపాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details