ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Amul Dairy: మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్​ కార్పెట్​ వేసి మరీ సహకారం..! - jagan importance to amul dairy

Government Importance to Amul: స్థానిక సహకార పాల ఉత్పత్తి సంఘాలను కాదని.. అమూల్‌కు రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానం కల్పించగా.. పొరుగు రాష్ట్రాలు మాత్రం ఖరాఖండిగా అమూల్‌ వద్దంటూ తెగేసి చెబుతున్నాయి. కర్ణాటక దారిలోనే తమిళనాడు సైతం తమ రాష్ట్రంలో పాలు సేకరించొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం పాల సేకరణ నుంచి అన్నీ తానై అమూల్‌కు సాగిలపడుతోంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అప్పనంగా అప్పగించేసింది.

Government Importance to Amul
Government Importance to Amul

By

Published : May 30, 2023, 7:17 AM IST

మొన్న కర్నాటక.. నేడు తమిళనాడు.. అయినా మారని ఏపీ తీరు.. రెడ్​ కార్పెట్​ వేసి మరీ సహకారం..!

Government Importance to Amul: సహకార స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నఅమూల్‌ డెయిరీ మాకొద్దంటూ పొరుగు రాష్ట్రం కర్ణాటక కన్నెర్ర చేయగా.. ఇప్పుడు అదే బాటలో మరో రాష్ట్రం తమిళనాడు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ రాష్ట్రంలో అమూల్ సంస్థ పాలు సేకరించొద్దంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఖరాఖండింగా చెప్పారు. సహకార స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలు వద్దంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి.

లక్షలాది పాడి రైతుల జీవితాలను ఆగాధంలోకి నెట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన విజయ డెయిరీని చంపేసి.. అమూల్‌ను నెత్తికెక్కించుకుంది. గుజరాత్‌కు చెందిన ఈ సంస్థకు దక్షిణాదిలో తొలి రెడ్‌ కార్పెట్‌ పరిచిన రాష్ట్రం ఏపీనే. స్థానిక డెయిరీలను బెదిరించి.. రైతులను భయపెట్టి.. వైసీపీ నేతలకు లక్ష్యాలను నిర్దేశించి మరీ అమూల్‌కు పాల సేకరించి పెడుతోంది జగన్ ప్రభుత్వం. దశాబ్దాలుగా రైతులే నిర్వహించుకుంటున్న సహకార పాల ఉత్పత్తి సంఘాలను దెబ్బతీసి అమూల్‌కు అగ్రతాంబూలం కట్టబెట్టారు సీఎం జగన్.

కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అమూల్‌ రాకతో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నా..మన రాష్ట్ర సీఎం జగన్‌ మాత్రం అమూల్‌తోనే అంటకాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలోని సహకార డెయిరీలను మూసేసి.. వాటికి చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని బంగారు పళ్లెంలో పెట్టి అమూల్‌కు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో అమూల్‌ వచ్చాక పాల సేకరణ ధర పెరిగిందని, రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని సీఎం జగన్‌ ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే.. కర్ణాటకలో గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోని నేతలే అమూల్‌కు ఎందుకు అభ్యంతరం చెప్పారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయమూ.. ప్రభుత్వ పెద్దలకు తెలుసా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యా 1974 నుంచి 22 వేల గ్రామాల్లో 24 లక్షల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తోంది. ప్రతిరోజూ రైతులకు 17 కోట్ల రూపాయలకు పైగా చెల్లిస్తోంది. సుమారు 65 రకాల పాలు, పాల ఉత్పత్తులను నందిని బ్రాండ్‌పై మార్కెటింగ్‌ చేస్తోంది. బెంగళూరులో అమూల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామనే నిర్ణయంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పార్టీలకు అతీతంగా అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అదే విధంగా తమిళనాడులోనూ 1981 నుంచి సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా పాలు సేకరిస్తున్నారు. 9వేల 673 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా 4.5 లక్షల మంది సభ్యుల నుంచి ప్రతిరోజూ 35 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రాష్ట్రాల్లోనూ దాణా, మినరల్ మిక్చర్‌, గడ్డితో పాటు పశువుల ఆరోగ్య పరిరక్షణ, పునరుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నారు.

కానీ మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ ప్రభుత్వమే అమూల్‌ ప్రతినిధిలా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా పాలను సేకరించి అమూల్‌కు సరఫరా చేస్తోంది. అవసరమైన ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. భవనాల నిర్మాణం, యంత్రాల కోసం సుమారు 3వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతోంది. ఇవి కాకుండా A.P.D.D.C.F ఆధ్వర్యంలోని యూనిట్లను అప్పనంగా తక్కువ ధరకే కట్టబెడుతోంది. చిత్తూరు డెయిరీతో పాటు మదనపల్లె ప్లాంటును ఇప్పటికే అప్పగించింది. పట్టణాల్లో అమూల్‌ ఔట్‌లెట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తోంది. ఇవన్నీ పైసా పెట్టుబడి లేకుండా కల్పించే ప్రయోజనాలే. పశుసంవర్థక అధికారులతోపాటు A.P.D.D.C.F.కూడా అమూల్‌ కోసమే పనిచేస్తున్నాయి. జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల నుంచి గ్రామాల్లో పశుసంవర్థక సహాయకుల వరకు నిత్యం అమూల్‌ సేవలోనే తరిస్తున్నారు. అమూల్‌తో రైతుల ఆదాయం పెరిగిందంటూ.. సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు 4 రూపాయల చొప్పున బోనస్‌ ఇస్తామని జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి నీళ్లొదిలేశారు.

రాష్ట్రంలో అమూల్​​కు పచ్చజెండా ఊపి 30 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ రోజువారీ పాల సేకరణ 2 లక్షల లీటర్లు చేరలేదు. ప్రభుత్వం చెబుతున్నట్లు ధర ఎక్కువగా ఉంటే రైతులు పాలు పోయాలి కదా.. డబ్బులు ఎక్కువ ఇస్తుంటే రైతులను మాత్రం ఎవరు ఆపగలరూ..? ఆ మాత్రం విచక్షణ కూడా లేకుండా ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఇతర డెయిరీలు ఇచ్చే ధరలతో పోలిస్తే రైతులకు అమూల్‌ చెల్లించేది తక్కువే. S.N.F. పేరిట రైతులకు ఇచ్చే ధరలో కోత పెడుతోంది. అమూల్‌ కన్నా కృష్ణా మిల్క్‌ యూనియన్‌, సంగం డెయిరీ, విశాఖ డెయిరీలు లీటరుకు 7 నుంచి 15 రూపాయల వరకు అధికంగా చెల్లిస్తున్నాయి. ఏటా బోనస్‌లు ఇస్తున్నాయి. వీర్యాన్ని పంపిణీ చేయడంతో పాటు దాణా, వైద్యసేవలు అందిస్తున్నాయి. అయినా ప్రభుత్వం అమూల్‌కు పెద్దపీట వేస్తూ పాడి రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది.

ABOUT THE AUTHOR

...view details