గ్రామాలను వ్యర్థ రహిత, ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో రెండేసి గ్రామాలు చొప్పున 114 పల్లెలను ఎంపిక చేశారు. పక్షోత్సవాల్లో ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను చేయాలి. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉందా? లేదా? అని చూసి గృహస్థులు నిర్మించుకునేలా చూడాలి. స్నానానికి ఉపయోగించే నీరు, శుభ్రపరచిన పాత్రలు, దుస్తులు ఉతికిన తర్వాత వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంతలకు మళ్లించి మురుగు నీరు రోడ్ల మీదకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తులు వ్యక్తిగత పారిశుద్ధ్యం గురించి తెలుసుకోవడం వల్ల ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కొనే విధంగా అవగాహన కల్పించాలి. పైలట్ గ్రామాల్లో సామాజిక మరుగుదొడ్లను నిర్మించి గ్రామస్థులకు అందుబాటులో ఉంచాలి. బహిరంగ మల విసర్జన చేసిన వారికి జరిమాన విధించేలా స్థానికులు ఓ విధానాన్ని రూపొందించుకుని అమలు చేయాలి. గ్రామంలోని అన్ని గృహాలకు సురక్షిత తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. నీటి, పారిశుద్ధ్య కమిటీని ఏర్పాటు చేయాలి. ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరణ, ఎస్‌డబ్ల్యూపీసీకి రవాణా, ఘన వ్యర్థ పదార్థాలను వేరు చేయడం, రీసైక్లింగ్, వర్మీ కంపోస్టు ప్రాసెసింగ్ క్రమం తప్పకుండా చేయాలి. గ్రామంలో 500 కంటే ఎక్కువ ఆవులు, గేదెలు ఉంటే కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి.
పక్షోత్సవాలను ప్రారంభించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఎంపీడీవో ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, గ్రామ సచివాలయం సిబ్బంది బోరు మెకానిక్, గ్రీన్ అంబాసిడర్ సభ్యులుగా ఉంటారు.అవసరమైన పరికరాలను వెంట తీసుకెళ్లి గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. జిల్లాను పారిశుద్ధ్యంలో ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తున్నాం. - డి.చైతన్య, గుంటూరు జిల్లా పరిషత్తు సీఈవో