ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్.. మండిపడుతున్న రాజధాని రైతులు - ఐనవోలు

Special R5 zone in Amravati: రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 901 ఎకరాల్లో రెసిడెన్షియల్‌ జోన్‌ కోసం మాస్టర్‌ప్లాన్‌లో సవరణ చేస్తూ గెజిట్‌ జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు 15 రోజుల గఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్‌ అవసరాలకు కేటాయించిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని 2020 మార్చిలోనే హైకోర్టు స్పష్టం చేసినా మొండిగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనిపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.

Special R5 zone in Amravati
పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్​

By

Published : Oct 28, 2022, 9:09 PM IST

Updated : Oct 29, 2022, 7:05 AM IST

special R5 zone: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో భవిష్యత్‌ అవసరాల కోసం కేటాయించిన 10 వేల ఎకరాల్లో.. 901 ఎకరాల్లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఇటీవలే సీఆర్‌డీఏ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. దాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా అమరావతి బృహత్‌ ప్రణాళికలో మార్పులు చేస్తోంది. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలో 901 ఎకరాల్లో బలహీనవర్గాల గృహనిర్మాణానికి.. ఆర్‌-5 పేరుతో కొత్త రెసిడెన్షియల్‌ జోన్‌ను ప్రతిపాదిస్తూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి.. ఆ తర్వాత సవరణలను సీఆర్‌డీఏ ఆమోదించనుంది.

రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జోనల్‌ రెగ్యులేషన్‌ విధానానికి.. సీఆర్‌డీఏ బృహత్‌ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు 2020 మార్చి 23నే విస్పష్టంగా చెప్పింది. రాజధానిలో 1251 ఎకరాల్లో విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల వంటి ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 2020 ఫిబ్రవరి 25న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 107ను సస్పెండ్‌ చేసింది. అయినా పట్టు వదలని ప్రభుత్వం ఇప్పుడు సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించి మరీ.. మాస్టర్‌ప్లాన్‌లో మార్పు చేర్పులు చేస్తోంది. సీఆర్‌డీఏ చట్టసవరణను సవాల్‌ చేస్తూ ఇటీవల రాజధాని రైతులు వేసిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే.. ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌లో సవరణలకు సిద్ధమైంది. అది ముమ్మాటికీ కోర్టు ధిక్కారమేనని రాజధాని రైతులు మండిపడుతున్నారు.

రాజధాని అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే క్రమంలో.. భవిష్యత్‌ అవసరాల కోసం మాస్టర్‌ప్లాన్‌లో సుమారు 10 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం రిజర్వు చేసి పెట్టింది. దానిలో స్టార్టప్‌ ఏరియాకు కేటాయించిన 1691 ఎకరాలు తీసేయగా సీఆర్‌డీఏ చేతిలో 8 వేల 274 ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు. అందులో 3వేల 254 ఎకరాల్ని భవిష్యత్తులో వివిధ ప్రాజెక్టులకు భూములు కేటాయించేందుకు రిజర్వు చేసింది. మిగతా 5వేల 20 ఎకరాల్లో 3వేల 709 ఎకరాలను 2023 నుంచి దశలవారీగా విక్రయించి రాజధాని నిర్మాణానికి వెచ్చించాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణం ఒక రోజులోనో, ఒక ప్రభుత్వ హయాంలోనో పూర్తయ్యేది కాదని, 50 ఏళ్లయినా పడుతుందని ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ధర్మాన చెప్పినట్టుగా... దశలవారీగా రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు.. భవిష్యత్‌ అవసరాలకు భూమి కావాలని రాజధాని రైతులు అంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదన్న రైతులు.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో అనేక చోట్ల ప్రభుత్వం భూమి కొని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని గుర్తుచేశారు. రాజధానికి దగ్గరలోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే కొని ఇవ్వచ్చని.. రాజధాని నిర్మాణానికి తామిచ్చిన భూముల్లో పట్టాలు ఇవ్వడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

47 వేల మందికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దాని కోసం రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 901 ఎకరాలతో ఆర్‌-5 జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. మాస్టర్‌ప్లాన్‌లో రిజర్వు జోన్, రీజినల్‌ సెంటర్‌ జోన్, కాలుష్య రహిత పరిశ్రమల జోన్, టౌన్‌ సెంటర్‌ జోన్, బిజినెస్‌ పార్క్‌ జోన్, ఎడ్యుకేషన్‌ జోన్లుగా వర్గీకరించిన భూముల్లోనే ఇప్పుడు ఆర్‌-5 జోన్‌ను ప్రతిపాదించారు. అవన్నీ విద్య, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములే. 901 ఎకరాల్లో 670 ఎకరాలు కాలుష్యరహిత పరిశ్రమల కోసం కేటాయించిన భూములే. మాస్టర్‌ప్లాన్‌లో సవరణలపై గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన రోజే గుంటూరు జిల్లా కలెక్టర్‌కు, రాజధానిలోని ఐదు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ లేఖలు రాశారు. రాజధానిలో ప్రతిపాదిత భూ వినియోగ మార్పిడికి ఈ నెల 27న జరిగిన సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఆమోదం లభించిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం తమను సంప్రదించకుండా మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయరాదంటూ రైతులు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల 25న వినతిపత్రాలు అందజేశారు. ఇంతలోనే ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఆగ్రహంతో ఉన్న రైతులు.. న్యాయస్థానంలోనే విషయాన్ని తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్.. మండిపడుతున్న రాజధాని రైతులు

ఇవీ చదవండి:

Last Updated : Oct 29, 2022, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details